India: వ్యాక్సిన్ వస్తే ఏం చేయాలి? ఎలా చేయాలి?... 112 పేజీల డాక్యుమెంట్ ను విడుదల చేసిన కేంద్రం!

  • వ్యాక్సిన్ కు ఎప్పుడైనా అనుమతులు
  • మొత్తం ఐదుగురితో ఒక్కో వ్యాక్సినేషన్ టీమ్
  • మొబైల్ టీమ్ లను కూడా ఏర్పాటు చేస్తున్నాం
  • భారీ ఎత్తున కోల్డ్ స్టోరేజ్ యూనిట్ల ఏర్పాటు
  • వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ
India Releases 112 Pages Document for Vaccine Distribution

ఇండియాలో కరోనా వ్యాక్సిన్ కు ఎప్పుడైనా అనుమతులు లభించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వం మిగతా ఏర్పాట్లలో నిమగ్నమైంది. వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తే, అప్పుడు తొలుత ఫ్రంట్ లైన్ వర్కర్లకు, ఆపై ప్రజలకు ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ఇచ్చే వర్కర్లు, పంపిణీ విధానం, లాజిస్టిక్స్, వ్యాక్సిన్ స్టోరేజ్ తదితర అంశాలపై తీసుకోవాల్సిన చర్యలు, వర్కర్లకు శిక్షణపై 112 పేజీల ప్రత్యేక డాక్యుమెంట్ ను విడుదల చేసింది.

రోజుకు ఒక్కో సెషన్ లో 100 మందికి కొవిడ్-19 వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. ఆపై ఏర్పాట్లన్నీ సక్రమంగా ఉండి, సిబ్బంది అందుబాటులో ఉంటే ఈ సంఖ్యను 200కు పెంచుతుంది. కేంద్ర పాలితప్రాంతాల్లో ఎప్పుడు వ్యాక్సినేషన్ వేయాలనేది అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్లు నిర్ణయిస్తారు. ఎన్నికల విధానం మాదిరిగానే కరోనా వ్యాక్సినేషన్ విధానం కూడా ఉండనుంది.

"అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కొవిడ్-19 వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. దేశానికి వ్యాక్సిన్ ను పరిచయం చేసేందుకు మేమూ ఆతృతతో ఉన్నాం. ఇది ఓ మైలురాయి అవుతుంది. ఇప్పటికే జాతీయ నిపుణుల కమిటీ అన్ని విధివిధానాలనూ తయారు చేసింది. అన్ని రకాలుగా ఆలోచించిన తరువాతనే వ్యాక్సిన్ వాడకాన్ని ప్రారంభిస్తాం" అని ఆరోగ్య శాఖ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రతి సెషన్ లో 100 మందిని ఎంపిక చేసి, వారికి వ్యాక్సిన్ ఇస్తామని, ఇందుకోసం సెషన్ సైట్స్ ను నిర్ణయిస్తామని, ఆపై హై రిస్క్ ప్రజలకు వ్యాక్సిన్ అందుతుందని, ఇందుకోసం మొబైల్ టీమ్ లను సిద్ధం చేస్తున్నామని ఈ డాక్యుమెంట్ లో ఆరోగ్య శాఖ పేర్కొంది.

ఇక ఒక్కో వ్యాక్సినేషన్ టీమ్ లో ఓ డాక్టర్, నర్సు, ఫార్మాసిస్ట్ లేదా క్వాలిఫైడ్ ఇంజక్టర్ సహా ఐదుగురు సభ్యులుంటారని, రెండో అధికారి యూజర్ రిజిస్ట్రేషన్ తదితరాలను చెక్ చేస్తారని, మూడో అధికారి అతని డాక్యుమెంట్లను పరిశీలిస్తారని డాక్యుమెంట్ లో పేర్కొంది. మిగతావారు క్రౌడ్ మేనేజ్ మెంట్, కమ్యూనికేషన్ తదితాలను పర్యవేక్షిస్తారని తెలిపింది. వ్యాక్సిన్ ను వాడకానికి సిద్ధంగా ఉంచేలా కోల్డ్ స్టోరేజ్ యూనిట్లను కూడా భారీ ఎత్తున సిద్ధంగా ఉంచామని వెల్లడించింది.

  • Loading...

More Telugu News