Sonu Sood: తప్పనిసరిగా వార్తాపత్రికలు చదవాలని మా పిల్లలకు చెబుతుంటా: సోనూ సూద్

  • వార్తాపత్రికల ప్రాముఖ్యత వివరించిన సోనూ సూద్
  • తన జీవితంలో వీడదీయరాని భాగం అని వెల్లడి
  • బాల్యంలో స్కూల్లో తప్పనిసరిగా చదివించేవారని వివరణ
  • తల్లిదండ్రుల కోసం ప్రతిరోజూ న్యూస్ పేపర్ తెచ్చేవాడ్నన్న సోనూ
  • ప్రపంచంలో ఏం జరుగుతోందో విద్యార్థులు తెలుసుకోవాలని సూచన
Sonu Sood opines on the importance of the news papers

కరోనా కష్టకాలంలో వలసజీవుల పాలిట దేవుడిలా మారిన వ్యక్తి సోనూ సూద్. ఖర్చుకు వెనుకాడకుండా, వలసజీవులు దేశంలో ఏ మూలన ఉన్నా వారిని స్వస్థలాలకు చేర్చేందుకు సోనూ సూద్ పడిన తపన అంతాఇంతా కాదు. ఇప్పుడు సోనూ ఎక్కడికి వెళ్లినా ఆత్మీయంగా సత్కరిస్తున్నారు. తాజాగా రేడియో మిర్చి ఎఫ్ఎం చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ నటుడు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. వార్తాపత్రికలు తప్పనిసరిగా చదవాలని తన పిల్లలకు చెబుతుంటానని తెలిపారు. ఎంతో విలువైన సమాచారాన్ని అందించే వార్తాపత్రికలు దైనందిన జీవితంలో నిత్యావసర వస్తువులు అని అభివర్ణించారు.

తాను స్కూల్లో చదువుకునే రోజుల్లో న్యూస్ పేపర్లు చదవడం కూడా బోధనలో భాగంగా ఉండేదని, క్లాసులో ప్రతిరోజు 20 వార్తల వరకు చదవాల్సి ఉంటుందని తెలిపారు. ప్రపంచంలో ఏం జరుగుతోందో విద్యార్థులకు కూడా తెలియాలంటే ఇలాంటి కార్యాచరణను స్కూళ్లలో తప్పనిసరి చేయాలని సోనూ సూద్ సూచించారు.  

పంజాబ్ లోని తన సొంత ఊర్లో ఉన్నప్పుడు కూడా తన తల్లిదండ్రుల కోసం వార్తాపత్రికలు తీసుకురావడం తన దినచర్యలో ఓ భాగం అని వెల్లడించారు. ఇప్పటికీ న్యూస్ పేపర్లు తన జీవితంలో విడదీయరానివిగా మారిపోయాయని పేర్కొన్నారు.

More Telugu News