Iphone: బెంగళూరు సమీపంలోని ఐఫోన్ తయారీ ప్లాంట్ లో ఉద్యోగుల విధ్వంసం.. 132 మంది అరెస్ట్!

Employees vandalised Iphone plant in Karnataka
  • కోలార్ సమీపంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ప్లాంట్
  • జీతాలు చెల్లించకపోవడంతో ఉద్యోగుల ఆగ్రహం
  • వాహనాలకు కూడా నిప్పు పెట్టిన వైనం
కర్ణాటకలో ఉన్న ఐఫోన్ తయారీ ప్లాంట్ లో ఆ కంపెనీ ఉద్యోగులు విధ్వంసం సృష్టించారు. బెంగళూరుకు సమీపంలో కోలార్ జిల్లాలోని నర్సాపురలో ఈ  ప్లాంట్ ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వేతనాలు చెల్లించలేదనే ఆగ్రహంతో ఉద్యోగులు ప్లాంట్ పై దాడి చేశారు. ఈ ఘటనకు కారణమైన కనీసం 132 ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్లాంట్ ను తైవాన్ కు చెందిన టెక్ దిక్కజం విస్ట్రన్ కార్పొరేషన్ నిర్వహిస్తోంది.

ఈ ఉదయం ఫస్ట్ షిఫ్ట్ లో పని చేసేందుకు దాదాపు 2 వేల మంది ఉద్యోగులు ప్లాంటుకు వచ్చారు. జీతాలు ఇంకా చెల్లించలేదనే ఆగ్రహంతో ప్లాంట్ పై దాడి చేశారు. అసెంబ్లింగ్ యూనిట్లను, ఫర్నిచర్ ను ధ్వంసం చేశారు. వాహనాలకు నిప్పు కూడా పెట్టారు. సమాచారం అందుకున్న వెంటనే కోలార్ కు చెందిన సీనియర్ పోలీసు అధికారులు, అదనపు బలగాలతో సహా ప్లాంట్ వద్దకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.

మరోవైపు కొందరు ఉద్యోగులు తమ ఫోన్లతో తీసిన వీడియోలలో పలు దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అద్దాలు, డోర్లను పగలగొట్టడం, కార్లను తలకిందులు చేయడం, సీనియర్ ఎగ్జిక్యూటివ్ ల కార్యాలయాలపై దాడి చేయడం వంటివి ఈ వీడియోల్లో ఉన్నాయి. అయితే, ఈ హింసపై ఇంత వరకు విస్ట్రన్ కార్పొరేషన్ స్పందించలేదు.

బెంగళూరుకు 60 కిలోమీటర్ల దూరంలో కోలార్ సమీపంలోని నర్సాపుర ఇండస్ట్రియల్ ఏరియాలో ఈ ప్లాంట్ ఉంది. 43 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. రూ. 2,900 కోట్ల పెట్టుబడి పెడతామని, 10 వేల మందికి పైగా ఉపాధిని కల్పిస్తామనే ఒప్పందంతో ఈ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం 43 ఎకరాల స్థలాన్ని కేటాయించింది.
Iphone
Bengaluru
Kolar
Wistron
Employees
Attack

More Telugu News