తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా సోమేశ్ కుమార్

12-12-2020 Sat 08:54
  • నియమావళిని సవరించిన సంఘం
  • అదెలా కుదురుతుందన్న ఇద్దరు సభ్యులు
  • సీఎస్ అధ్యక్షుడిగా ఉంటే సమస్యలు పరిష్కారమవుతాయన్న మెజారిటీ సభ్యులు
CS Somesh kumar is the new chief of Telangana IAS association

తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించిన బీపీ ఆచార్య పదవీ విరమణ పొందడంతో ఆయన స్థానంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సంఘం అధ్యక్షుడిగా పనిచేయనున్నారు. నిజానికి ఈ సంఘానికి హైదరాబాద్‌లో పనిచేస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ వస్తుండగా, ఇప్పుడు ఈ నిబంధనను సవరించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడిగా వ్యవహరించాలని ప్రతిపాదించారు. ఈ మేరకు గురువారం సంఘ భవనంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

వికాస్‌రాజ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సంఘం నియమావళిని సవరించారు.  ఇకపై సీఎస్ మాత్రమే అధ్యక్షుడిగా వ్యవహరించాలని ప్రతిపాదించారు. అయితే, సురేశ్‌చందా, అధర్ సిన్హా‌లు ఈ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ముందస్తు నోటీసు లేకుండా, అజెండాలో చేర్చకుండా నియమావళిని ఎలా సవరిస్తారని ప్రశ్నించారు. అయితే, మెజారిటీ సభ్యులు మాత్రం దీనికి ఓకే చెప్పడంతో నియమావళిని సవరించారు.

సంఘం నిర్ణయాన్ని వ్యతిరేకించిన సురేశ్ చందా.. అధ్యక్షుడి అనుమతి లేకుండా సమావేశాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. తెలంగాణ ఐఏఎస్‌లను ఆ దేవుడే కాపాడాలని అన్నారు. సమావేశం విషయంలో తనను ఎవరూ సంప్రదించలేదని, తాను సమావేశానికి హాజరైనా ఎవరూ తనను అధ్యక్షుడిగా గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షుడిగా ఉండడం వల్ల సమస్యల పరిష్కారమవుతాయని, తద్వారా సంఘానికి మేలు జరుగుతుందని మిగతా సభ్యులు అభిప్రాయపడ్డారు.