నా కుమార్తెను హేమంతే చంపేశాడు: టీవీ సీరియల్ నటి వీజే చిత్ర తల్లి

12-12-2020 Sat 07:29
  • బుధవారం హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న నటి
  • కాబోయే భర్త హేమంత్‌పై అనుమానం వ్యక్తం చేసిన చిత్ర తల్లి
  • ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదన్న తండ్రి
Actress VJ Chitra Mother accused Hemanth behind chitra suicide

తన కుమార్తెను అల్లుడే కొట్టి చంపేసి ఉంటాడని తమిళ టీవీ సీరియల్ నటి వీజే చిత్ర (28) తల్లి అనుమానం వ్యక్తం చేశారు. ‘పాండియన్ స్టోర్స్’ టీవీ సీరియల్ ద్వారా పాప్యులారిటీ సంపాదించుకున్న చిత్ర బుధవారం తెల్లవారుజామున చెన్నైలోని నజ్రత్‌పెట్టెయ్‌లో ఉన్న హోటల్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాబోయే భర్త హేమంత్‌తో కలిసి కొన్ని రోజులుగా ఆమె అదే హోటల్‌లో ఉంటోంది. చిత్ర-హేమంత్‌లు చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నారు. అంతేకాదు, కొన్ని నెలల క్రితం వీరు రహస్యంగా పెళ్లి చేసుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి.

కాగా, తన కుమార్తె ఆత్మహత్యపై చిత్ర తల్లి మాట్లాడుతూ.. తన కుమార్తెను హేమంతే కొట్టి చంపేసి ఉంటాడని  అనుమానం వ్యక్తం చేశారు. చిత్ర-హేమంత్ ఇద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నారని, ఆ విషయాన్ని అందరికీ తెలియజేసేందుకు ఈ ఏడాది పెద్దల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారని చిత్ర తండ్రి తెలిపారు. చిత్ర ఆత్మహత్యకు ఎందుకు పాల్పడిందన్న విషయం తమకు అర్థం కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.