Prabhas: దక్షిణాసియా సెలబ్రిటీ దాతల జాబితాలో ప్రభాస్ కు ఏడో స్థానం

Prabhas gets seventh spot in South Asia celebrity donors list
  • దాతృత్వ సేవల ఆధారంగా జాబితా  
  • జాబితా వెల్లడించిన బ్రిటన్ పత్రిక ఈస్టర్న్ ఐ
  • కరోనా కట్టడి కోసం రూ.4 కోట్లు విరాళమిచ్చిన ప్రభాస్
  • కరోనా క్రైసిస్ చారిటీకి రూ.50 లక్షలు అందజేత
  • వందలాది ఎకరాల అటవీ భూమి దత్తత
  • జాబితాలో చోటు దక్కించుకున్న ప్రియాంక చోప్రా, అమితాబ్
బ్రిటన్ వారపత్రిక 'ఈస్టర్న్ ఐ' దక్షిణాసియా సెలబ్రిటీ దాతల జాబితాను వెల్లడించింది. సమాజం కోసం తారలు ఇచ్చే విరాళాలు, వారి సేవల ఆధారంగా ఈ జాబితా రూపొందించారు. ఇందులో టాలీవుడ్ అగ్రహీరో ప్రభాస్ కు ఏడోస్థానం దక్కింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభాస్ ప్రభుత్వాలకు రూ.4 కోట్ల విరాళం ఇచ్చారు. కరోనా క్రైసిస్ చారిటీ పట్ల కూడా ఉదారంగా స్పందించిన ప్రభాస్ రూ.50 లక్షలు ఇచ్చారు.

అటు, పర్యావరణ హితం కోరి హైదరాబాద్ కు సమీపంలోని ఖాజీపల్లి వద్ద 1,650 ఎకరాల అటవీ భూమిని దత్తత తీసుకున్నారు. అంతేకాకుండా, ఆ రిజర్వ్ ఫారెస్ట్ అభివృద్ధి కోసం రూ.2 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ అటవీ భూములను తన తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణరాజు పేరిట ఎకో పార్క్ గా అభివృద్ధి చేసేందుకు ప్రభాస్ ముందుకు వచ్చారు.

ఇక, దక్షిణాసియా సెలబ్రిటీ దాతల జాబితాలో పాన్ ఇండియా నటుడు సోనూ సూద్ నెంబర్ వన్ గా నిలిచారు. కరోనా లాక్ డౌన్ సమయంలో సోనూ సూద్ అందించిన సేవలు ఎనలేనివి. ముఖ్యంగా, దేశవ్యాప్తంగా చిక్కుకుపోయిన వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చడంలో సోనూ సూద్ స్పందించిన తీరు అందరి ప్రశంసలకు నోచుకుంది. ఇప్పటికీ ఏదో ఒక రూపేణా సోనూ సూద్ దాతృత్వ సేవలు కొనసాగుతూనే ఉన్నాయి.

భారత్ నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్నవారిలో అందాల భామ ప్రియాంక చోప్రా (6), బాలీవుడ్ నట దిగ్గజం అమితాబ్ బచ్చన్ (20) కూడా ఉన్నారు.
Prabhas
South Asia Celebrity
Donations
Philonthropic
Corona Virus
Pandemic

More Telugu News