Narendra Modi: ఢిల్లీకి బయల్దేరిన కేసీఆర్.. మోదీతో భేటీ లేనట్టే!

  • రెండు, మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉండే అవకాశం
  • పంటి చికిత్స కోసం డెంటిస్ట్ ను కలవనున్న సీఎం 
  • మోదీ అపాయింట్ మెంట్ ను కోరలేదని సమాచారం
KCR leaves to Delhi

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి బయల్దేరారు. ఆయన షెడ్యూల్ కు సంబంధించి పూర్తి క్లారిటీ లేనప్పటికీ... రెండు, మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీ పర్యటన కొనసాగే అవకాశాలు ఉన్నాయి. పంటి చికిత్స కోసం ఢిల్లీలోని ఓ ప్రముఖ డెంటిస్ట్ ను ఆయన కలవనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం కేటాయించిన స్థలంలో ఆయన భూమి పూజ చేసే అవకాశాలు ఉన్నాయి.

తన పర్యటనలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో పాటు పలువురు ఇతర కేబినెట్ మంత్రులను ఆయన కలిసే అవకాశం ఉంది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై వారితో చర్చలు జరపనున్నారు. మరోవైపు, ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ ను కేసీఆర్ కోరలేదని సమాచారం. దీంతో, మోదీతో కేసీఆర్ భేటీ అయ్యే అవకాశాలు లేవనే తెలుస్తోంది.

మరో ఆసక్తికర విషయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న కేసీఆర్... రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ కు పూర్తి మద్దతు పలికారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులన్నీ బంద్ లో పాల్గొన్నాయి. దీంతో, ఢిల్లీ శివార్లలో మకాం వేసిన రైతులను ఆయన కలుస్తారా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతోందో వేచి చూడాలి.

More Telugu News