Ravishastri: భారత్ లో లాక్ డౌన్ అత్యంత కఠినం... ఆస్ట్రేలియాలో మాత్రం ప్రజలు ఎంతో స్వేచ్ఛగా తిరిగారన్న రవి శాస్త్రి!

  • ఇండియాలో ఎవరూ బయటకు రాలేదు
  • ఇళ్లకే పరిమితమై ఐపీఎల్ తరువాత ఆసీస్ కు వచ్చిన ఆటగాళ్లు
  • రోహిత్, బుమ్రా లేకుండానే విజయాల బాటన ఇండియా 
Lockdown was tough on Indians than Australians says Ravishastri

ఇండియాలో లాక్ డౌన్ నిబంధనలు ఎంతో కఠినమని, అదే ఆస్ట్రేలియాలో ప్రజలు ఎంతో స్వేచ్ఛగా తిరుగుతున్నారని భారత క్రికెట్ జట్టు కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో భారత క్రికెట్ జట్టు పర్యటిస్తుండగా, రవిశాస్త్రి కూడా జట్టుతో పాటు ఉన్నారు.

తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, "ఇండియాలో లాక్ డౌన్ గుర్తుందా? ఎవరూ బయటకు రాలేదు. చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలు, పెద్ద పెద్ద ఇళ్లల్లో ఉన్న వారి పరిస్థితి కొంత మెరుగే. ప్రైవేటు ఓపెన్ ఏరియాల్లో వారు కొంత తిరిగారు.

అదే ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో ప్రతిఒక్కరూ వారి ఇళ్లు, అపార్టుమెంట్లకే పరిమితం అయ్యారు. ఇది ఎంతో ఇబ్బంది పెట్టిన పరిస్థితి. అదే ఆస్ట్రేలియా గురించే ఆలోచిస్తే, తమతమ నగరాల్లో ఎక్కడైనా తిరిగి వచ్చే అనుమతులున్నాయి. పార్కులు, మైదానాల్లోకి వారు వెళ్లారు. ఆసీస్ క్రికెటర్లు ఇంగ్లండ్ లోనూ పర్యటించి వచ్చారు. మనం ఇక్కడికి వచ్చే ముందు ఐపీఎల్ మాత్రమే ఆడాం" అని అన్నారు.

రోహిత్ శర్మ, జస్ ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు లేకుండానే టీ-20 సిరీస్ ను గెలుచుకున్నామని రవిశాస్త్రి గుర్తు చేశారు. భారత జట్టు ఇక్కడకు రావడానికి ముందు ఒక్కో బౌలర్ గరిష్ఠంగా 64 ఓవర్లలోపు మాత్రమే బౌలింగ్ చేశారు. అది కూడా నెలన్నర రోజుల వ్యవధిలోనే జరిగిందని తెలిపారు.

కాగా, భారత జట్టు ఫిబ్రవరి 2019 నుంచి భారత జట్టు ఆడిన టీ-20 మ్యాచ్ ల్లో కేవలం నాలుగింటిలో మాత్రమే ఓడిపోయిందన్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు వరుసగా 8 మ్యాచ్ లలో గెలుస్తూ వచ్చింది. ఆపై రెండు మ్యాచ్ లు గెలిచి, వరుసగా 10 మ్యాచ్ లు గెలిచిన తరువాత మూడవ టీ-20లో బ్రేక్ పడింది. దీన్నే ప్రస్తావించిన రవిశాస్త్రి, కీలక ఆటగాళ్లు లేకుండానే ఇండియా విజయాల బాటన నడుస్తుండటం గర్వకారణమని అన్నారు.

More Telugu News