Melania Trump: వైట్ హౌస్ నుంచి నిష్క్రమించేందుకు మెలానియా సన్నాహాలు... మొండికేస్తున్న ట్రంప్!

  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ కు మెజారిటీ
  • ఓటమిని అంగీకరించని ట్రంప్
  • మరికొన్నిరోజుల్లో బైడెన్ ప్రమాణస్వీకారం
  • ట్రంప్ కు వైట్ హౌస్ ఖాళీ చేయక తప్పని పరిస్థితి
  • మాజీలుగా భవిష్యత్ పై దృష్టి సారించిన మెలానియా
  • మార్-ఏ-లాగో ఎస్టేట్ కు వెళ్లే అవకాశం
 Melania Trump exercises to leave White House as Donald Trump refuse to agree Biden win

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ఎంతో సంక్లిష్టమైనదన్న సంగతి తెలిసిందే. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే సొంత నిబంధనలు, నియమాలు అమలు చేస్తుంటుంది. అందుకే ఎన్నికల ఫలితాలు కూడా కొన్ని రాష్ట్రాల్లో చాలా ఆలస్యంగా వెల్లడవుతున్నాయి. ఈ అంశాన్ని ఆసరాగా చేసుకున్న ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓటమిని అంగీకరించేందుకు మొండికేస్తున్నారు. అయితే డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో ఆయన పగ్గాలు స్వీకరించడం ఇక లాంఛనమే.  

ఏది ఏమైనా మరికొన్నిరోజుల్లో ట్రంప్ వైట్ హౌస్ ను ఖాళీ చేసి వెళ్లాల్సి ఉంటుంది. ఈ సంగతిని ముందే గ్రహించిన ఆయన భార్య మెలానియా ట్రంప్ హుందాగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నారు. వైట్ హౌస్ నుంచి వెళ్లిపోవాలని ఆమె భావిస్తున్నారు. అందుకే, మాజీ ప్రథమ మహిళగా ఎలాంటి అధికారాలు ఉంటాయి? మాజీ అధ్యక్షుడి కుటుంబానికి ఎలాంటి సదుపాయాలు కల్పిస్తారు? తమకు కేటాయించే బడ్జెట్ ఎంత? ఎంతమంది సిబ్బందిని ఇస్తారు? వంటి విషయాలను తెలుసుకునేందుకు ప్రత్యేకంగా సిబ్బందిని పురమాయించినట్టు వెల్లడైంది.

వాస్తవిక అంశాల పరంగా చూస్తే మెలానియా ఓ తల్లిగా, గృహిణిగా, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా బాధ్యతలు చక్కదిద్దాలనుకుంటున్నారట. మెలానియా ట్రంప్ కు బారోన్ అనే 14 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అతని బాగోగులతో పాటు వైట్ హౌస్ లో తన అనుభవాలతో ఫొటో ఆధారిత పుస్తకాన్ని వెలువరించాలని కూడా ఆమె భావిస్తున్నారని సన్నిహిత వర్గాలంటున్నాయి. పైగా ఈ క్రిస్మస్ ప్రథమ మహిళగా తనకు చివరిది కావడంతో వైట్ హౌస్ ను అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంపైనా ఆమె శ్రద్ధ చూపిస్తున్నారట.

ఇక, వైట్ హౌస్ ను వీడిన తర్వాత మార్-ఏ-లాగో ఎస్టేట్ లో ట్రంప్, మెలానియా గడపనున్నట్టు తెలుస్తోంది. వైట్ హౌస్ నుంచి,  న్యూయార్క్ సిటీలో ఉన్న ట్రంప్ టవర్ పెంట్ హౌస్ నుంచి మార్-ఏ-లాగో నివాసానికి వస్తు సరంజామా తరలించడంపై దృష్టి సారించారట.

కాగా, అమెరికా మాజీ అధ్యక్షులకు భారీగానే బడ్జెట్ కేటాయింపులు ఉంటాయి. వారు వ్యక్తిగతంగా కార్యాలయం నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వమే చేస్తుంది. సిబ్బంది ఖర్చులు, కొన్ని ప్రయాణ ఖర్చులను ఇస్తారు. అయితే మాజీ ప్రథమ మహిళకు ప్రభుత్వం నుంచి ఏమీ లభించదు. ఒకవేళ ఆమె భర్త చనిపోతే పెన్షన్ మాత్రం ఇస్తారు. అటు, ట్రంప్ 2024లోనూ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెబుతున్నారు.

More Telugu News