Narendra Modi: నూతన పార్లమెంటు ప్రజల జీవనాన్ని మెరుగుపరిచే తపోస్థలిగా నిలవాలి: ప్రధాని మోదీ ఆకాంక్ష

  • నూతన పార్లమెంటు భవనానికి ప్రధాని భూమి పూజ
  • అనంతరం వర్చువల్ విధానంలో ప్రసంగం
  • నూతన భవనం దేశప్రజలకు గర్వకారణమని వెల్లడి
  • ఆత్మనిర్భర్ భారత్ కు దిశానిర్దేశం చేస్తుందని ధీమా
  • పార్లమెంటు ఒక దేవాలయమంటూ  వ్యాఖ్యలు
  • రాబోయే ప్రజాప్రతినిధులు ప్రాణప్రతిష్ట చేయాలని ఉద్ఘాటన
PM Modi speech after new Parliament building Bhumi Pooja

ఢిల్లీలో నూతన పార్లమెంటు భవనానికి భూమి పూజ చేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ విధానంలో ప్రసంగించారు. కొత్త పార్లమెంటు భవనం ఎన్నో విశిష్టతలతో రూపుదిద్దుకోబోతోందని చెప్పారు. పార్లమెంటు పనితీరు మెరుగుదలకు అన్ని హంగులు, సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, ప్రస్తుత పార్లమెంటు భవనం స్వాతంత్ర్యం తర్వాత దేశానికి దశదిశ నిర్దేశం చేసిందని అన్నారు. తాము తాజాగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనం ఆత్మనిర్భర్ భారత్ కు దిశానిర్దేశం చేయనుందని స్పష్టం చేశారు.

పాత భవనానికి వందేళ్లు పూర్తవుతున్న వేళ కొత్త భవనం నిర్మిస్తున్నామని చెప్పారు.  నూతన పార్లమెంటు భవనం దేశప్రజలందరికీ గర్వకారణమని తెలిపారు. ఈ సరికొత్త భవనం స్వాతంత్ర్య భారతంలో రూపుదిద్దుకుంటోందని, భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఇదో కీలక మైలురాయి అని ప్రధాని మోదీ వివరించారు. పార్లమెంటు నూతన భవనం కూడా ఒక దేవాలయమేనని, ఈ దేవాలయంలో ప్రాణప్రతిష్ట చేయాల్సింది రాబోయే తరం ప్రజాప్రతినిధులేనని అభిప్రాయపాడ్డారు. దేశ ప్రజలందరి జీవనాన్ని మెరుగుపరిచే తసోస్థలిగా నూతన పార్లమెంటు భవనం నిలవాలని ఆకాంక్షించారు.

మాగ్నా కార్టా కంటే ముందే భారత్ లో హక్కుల కోసం ప్రయత్నాలు జరిగాయని ఈ సందర్భంగా ప్రస్తావించారు. మాగ్నా కార్టా కంటే ముందే బసవేశ్వరుడు ప్రజాస్వామ్య సూత్రాలు చెప్పారని వెల్లడించారు. దేశంలో ప్రజాస్వామ్యానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు జరిగాయని, 10వ శతాబ్దంలోనే తమిళనాడులో పంచాయతీ వ్యవస్థ గురించి వివరించారని తెలిపారు. భారతదేశ ప్రజాస్వామ్య ప్రస్థానానికి దాదాపు 1000 ఏళ్ల చరిత్ర ఉందని, రుగ్వేదంలోనూ ప్రజాస్వామ్యం గురించి ప్రస్తావన ఉందని అన్నారు.

భారత సహజ మూలాల్లోనే ప్రజాస్వామ్య ఛాయలు ఉన్నాయని, భారతదేశ తత్వచింతన అంతా ప్రజాస్వామ్యం ఆధారంగానే సాగిందని మోదీ వివరించారు. ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లిలాంటిదని ఉద్ఘాటించారు. దేశంలో ప్రతి ఎన్నికకు ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తోందని, ప్రజాస్వామ్య వ్యవస్థపై దేశ ప్రజల్లో ఉన్న నమ్మకానికి అదే నిదర్శనమని పేర్కొన్నారు.

More Telugu News