Jaggareddy: మూడు సార్లు ఓటమిపాలైన నాయకుల అభిప్రాయాలతో పనిలేదు: జగ్గారెడ్డి

  • ఇటీవల తెలంగాణ పీసీసీకి రాజీనామా చేసిన ఉత్తమ్
  • కొత్త చీఫ్ కోసం కసరత్తులు
  • కాంగ్రెస్ నేతలతో విడివిడిగా మాట్లాడుతున్న మాణికం ఠాగూర్
  • ఠాగూర్ తో భేటీ అయిన జగ్గారెడ్డి
  • గెలిచినవాళ్ల అభిప్రాయాలనే లెక్కలోకి తీసుకోవాలని విజ్ఞప్తి
  • తాను కూడా పీసీసీ రేసులో ఉన్నట్టు వెల్లడి
Congress MLA Jaggareddy comments on new PCC Chief selection process

జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ వైఫల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త పీసీసీ చీఫ్ ను ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ముమ్మర కసరత్తులు చేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణికం ఠాగూర్ ఒక్కొక్క నేతతో విడిగా మాట్లాడుతూ వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా మాణికం ఠాగూర్ తో భేటీ అనంతరం మీడియా ముందుకొచ్చారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎంపీలు, ఎమ్మెల్యేల అభిప్రాయాల మేరకే తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడ్ని ఎంపిక చేయాలని, మూడుసార్లు ఓటమిపాలైన నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరంలేదని స్పష్టం చేశారు. వి.హనుమంతరావు, కోదండరెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి వంటి నేతల అభిప్రాయాలకు విలువ ఇవ్వనవసరంలేదని అన్నారు.

ఇక తన గురించి చెబుతూ, తాను కూడా పీసీసీ చీఫ్ రేసులో ఉన్నానని వెల్లడించారు. పీసీసీ అధ్యక్ష పదవిని తనకు ఇవ్వాల్సిందిగా మాణికం ఠాగూర్ ను కోరానని జగ్గారెడ్డి వివరించారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవి కోసం తెలంగాణ కాంగ్రెస్ గ్రూపులుగా విడిపోయినట్టు వస్తున్న వార్తలు నిజమేనని అన్నారు.

More Telugu News