Virender Sehwag: వీరేంద్ర సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలపై కూల్ గా స్పందించిన మ్యాక్స్ వెల్!

  • కూల్ డ్రింక్స్ హోటల్ గదికి తీసుకెళ్లి తాగుతాడు
  • ఆస్ట్రేలియా తరఫున ఆడుతుంటే చక్కగా ఉంటాడు
  • ఐపీఎల్ కు వచ్చేది ఎంజాయ్ కోసమేనన్న సెహ్వాగ్
  • తానేమీ పట్టించుకోనని, స్పందించనని చెప్పిన మ్యాక్స్ వెల్
Glen Maxwell Cool Reply on Sehwag Hot Comments

ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్... ఈ పేరు భారత క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. గడచిన ఐపీఎల్ సీజన్ లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ యాజమాన్యం మ్యాక్స్ వెల్ ను రూ.10 కోట్లు వెచ్చించి, కొనుగోలు చేయగా, ఏ మాత్రం జట్టుకు ఉపయోగపడని ఆటతీరును ప్రదర్శించి, అందరినీ నిరాశపరిచాడు. ఐపీఎల్ లో మ్యాక్స్ వెల్ ప్రదర్శనపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఘాటుగా స్పందించగా, దాన్ని చాలా కూల్ గా తీసుకుని సమాధానం ఇచ్చాడు.

"ఆస్టేలియాతో ఆడేటప్పుడు, ఐపీఎల్ లో ఆడేటప్పుడు మనకు రెండు రకాల మ్యాక్స్ వెల్ కనిపిస్తాడు. ఆస్ట్రేలియాకు ఆడే వేళ రెండు మ్యాచ్ ల్లో విఫలమైతే తనను ఎక్కడ తీసేస్తారోనన్న భయం ఉంటుంది. దీంతో అతని ఆటతీరు, ప్రవర్తన మారిపోతాయి. ఐపీఎల్ లో అలా ఉండదు కాబట్టి మ్యాక్స్ వెల్ చాలా జాలీగా కనిపిస్తాడు. పూర్తిగా ఎంజాయ్ చేస్తుంటాడు. ఇతర ప్లేయర్లను ఎంకరేజ్ చేస్తుంటాడు. తాను మాత్రం ఆడడు. విహార యాత్రలకు వెళుతుంటాడు. ఉచితంగా ఆటగాళ్లకు ఇచ్చే డ్రింక్స్ ను హోటల్ గదికి తీసుకెళ్లి మరీ తాగుతుంటాడు. ఐపీఎల్ ఆటకన్నా, తనకు నచ్చే విషయాలపైనే దృష్టి పెడతాడు" అంటూ సెహ్వాగ్ విమర్శలు గుప్పించారు.

సెహ్వాగ్ వ్యాఖ్యల గురించి తెలుసుకున్న మ్యాక్స్ వెల్, "సెహ్వాగ్... మీ వ్యాఖ్యలపై స్పందించాలని భావించడం లేదు. ఎవరి అభిప్రాయం వారిది. ఐపీఎల్ క్రికెట్ లో నేను సరిగ్గా ఆడలేదన్న కోపం సెహ్వాగ్ కు ఉన్నట్టుంది. అతని మాటలు నన్నేమీ ఇబ్బంది పెట్టలేదు" అని వ్యాఖ్యానించాడు.

కాగా, ఐపీఎల్ లో రాణించని మాక్స్ వెల్, ఆస్ట్రేలియా తరఫున భారత్ పై ఆడుతూ మంచి ప్రదర్శన కనబరిచిన సంగతి తెలిసిందే. మూడు వన్డేల్లో 167 పరుగులు, టీ-20ల్లో 78 పరుగులు చేశాడు.

More Telugu News