Yanamala: వైసీపీ అసలు రంగు బయటపడింది: యనమల రామకృష్ణుడు

yanamala slams jagan
  • రసాయన పరిశ్రమల ఏర్పాటును వ్యతిరేకిస్తున్నాం
  • కోనసీమ ప్రాంత ప్రజల ప్రయోజనాలు దెబ్బతింటాయి
  • గతంలో వైసీపీ కూడా దివీస్‌ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకించింది
  • ఇప్పుడు దానికి అనుమతి ఇచ్చింది
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. రసాయన పరిశ్రమల ఏర్పాటును తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.  కోనసీమ ప్రాంత ప్రజల ప్రయోజనాలను దృష్ట్యా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఈ రసాయన పరిశ్రమల వల్ల సముద్ర జలాలు కలుషితమై మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

భూములన్నీ ఉప్పు తేలడంతో రైతులకూ నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 300పైగా హేచరీలు కూడా కాలుష్యంలో చిక్కుకుంటాయని, దీంతో చిరు వ్యాపారులకు కూడా నష్టం వాటిల్లుతుందని చెప్పారు. చేపల వేట లేకపోతే ఫిషింగ్ హార్బర్‌ ప్రతిపాదన అంతా పచ్చి మోసమేనని ఆయన పేర్కొన్నారు. బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమ ఏర్పాటునూ తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని అన్నారు.

కాకినాడ సెజ్‌లో 51 శాతం షేర్లను రూ.2511 కోట్లకు ఇప్పటికే కొనుగోలు చేశారని ఆరోపించారు. వైఎస్ జగన్‌ బినామీలు బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమల ఏర్పాటు ద్వారా కోనసీమ ప్రాంతంలోని గ్రామాలను కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తీర ప్రాంతాన్ని ఆక్రమించి తమ ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ స్థాపనకు యత్నిస్తున్నారని, ప్రజా వ్యతిరేక చర్యలను ఖండిస్తున్నామమని అన్నారు.

రసాయన పరిశ్రమ ఏర్పాటు ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని  అన్నారు. గతంలో వైసీపీ కూడా దివీస్‌ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకించిందని ఆయన చెప్పారు. ఇప్పుడు మాత్రం దానికి అనుమతి ఇచ్చిందని, దీంతో ఆ పార్టీ అసలు రంగు బయటపడిందని తెలిపారు.
Yanamala
YSRCP
Telugudesam

More Telugu News