Pakistan: భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ చేయబోతోందంటూ ఇంటెలిజెన్స్ రిపోర్ట్.. బెంబేలెత్తిపోతున్న పాకిస్థాన్!

  • రైతుల ఆందోళనల నుంచి ప్రపంచ దృష్టిని మరల్చే ప్లాన్  
  • భారత సైన్యం విరుచుకుపడే అవకాశం ఉంది
  • సరిహద్దుల్లో సైన్యాన్ని అలర్ట్ చేయాలంటూ పాక్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్
Pakistan afraid of new surgical strikes by India

ఇటీవలి కాలంలో ఇండియాలో ఏం జరిగినా మన దాయాది దేశం పాకిస్థాన్ వణికిపోతోంది. మన దేశంలోని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా జరిగితే... దాన్నుంచి ప్రపంచ దృష్టిని మరల్చేందుకు భారత ప్రభుత్వం పాకిస్థాన్ పై దాడులు జరుపుతుందనే భయాలు ఆ దేశంలో ఉన్నాయి.

కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతులు ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. భారత్ బంద్ ను కూడా చేపట్టారు. రైతు నేతలతో కేంద్ర ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలప్రదం కాలేదు. ఇప్పటికే రైతు ఆందోళనలకు కెనడా ప్రధాని ట్రూడో మద్దతు పలికారు. బ్రిటన్ పార్లమెంటులో సైతం ఈ అంశం చర్చకు వచ్చింది.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ విభాగం ఒక కీలక నివేదికను ఆ దేశ ప్రభుత్వానికి అందించింది. రైతు ఆందోళనల నుంచి ప్రపంచ దృష్టిని మరల్చేందుకు పాకిస్థాన్ పై భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ చేసే అవకాశం ఉందని నివేదికలో పేర్కొంది. భారత సైన్యం విరుచుకుపడే అవకాశం ఉందని తెలిపింది. సరిహద్దుల్లో సైన్యాన్ని అలర్ట్ చేయాలని సూచించింది. ఈ మేరకు పాక్ లోని ప్రముఖ పత్రిక ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది.

భారత్ లోని నిరసనలను బలహీనపరిచేందుకు హిందుత్వవాది అయిన మోదీ ఏమైనా చేయడానికి సిద్ధపడతారని ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ తెలిపింది. రైతుల ఉద్యమం మరో ఖలిస్థాన్ ఉద్యమంలా మారేందుకు భారత ప్రభుత్వం ఒప్పుకోదని వ్యాఖ్యానించింది. భారత్ ఎలాంటి దాడులకు యత్నించినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ పాక్ సైన్యానికి ఇప్పటికే ఆదేశాలు వెళ్లాయని తెలిపింది. మరోవైపు జియో న్యూస్ కూడా ఇలాంటి అభిప్రాయాన్నే వెల్లడించింది. అంతరంగిక సమస్యల నుంచి ప్రపంచ దృష్టిని మరల్చేందుకు పాక్ పై భారత్ సర్జికల్ స్ట్రయిక్స్ చేసే అవకాశం ఉందని పేర్కొంది.

More Telugu News