Maharashtra: మహిళలు, చిన్నారులపై క్రూరమైన నేరాలకు మరణదండన: మహారాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం

  • రెండు ముసాయిదా బిల్లులకు క్యాబినెట్ ఆమోదం
  • శీతాకాల సమావేశాల్లోనే అసెంబ్లీ ముందుకు
  • శిక్షలు తీవ్రంగా ఉంటాయన్న మహారాష్ట్ర హోమ్ మంత్రి
  • ఏపీలోని దిశ చట్టం తరహాలోనే శక్తి చట్టం
Death for Henious Crimes Against Women and Children in Maharashtra

మహిళలు, చిన్నారులపై క్రూరమైన నేరాలకు పాల్పడే వారిపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని మహారాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు ఉద్ధవ్ థాకరే అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్, రెండు ముసాయిదా బిల్లులను ఆమోదించింది. చిన్నారులపై అత్యాచారం, యాసిడ్ దాడుల కేసుల్లో దోషులకు మరణదండన విధించేలా చట్టాల్లో మార్పులను ప్రతిపాదించింది. ఈ తరహా కేసుల విచారణను మరింత వేగంగా పూర్తి చేసేందుకు కొత్త తరహా వ్యవస్థనూ ప్రతిపాదించింది.

సమీప భవిష్యత్తులో జరగనున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో 'శక్తి చట్టం' పేరిట ఈ రెండు బిల్లలనూ సభ ముందుంచాలని నిర్ణయించింది. ప్రత్యేక కోర్టుల ఏర్పాటు, ప్రస్తుతం విధిస్తున్న శిక్షలను మరింతగా పెంచడం, జరిగిన నేరాల వర్గీకరణ తదితర అంశాలనూ ఈ ముసాయిదా బిల్లుల్లో చేర్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టంలానే ఈ బిల్లు కూడా ఉండటం గమనార్హం. కొత్త చట్టాల ఆమోదం కోసం ఐపీసీ, సీఆర్పీససీ లోని చిన్నారులపై అత్యాచార నిరోధక చట్టాలను సవరించాలని కూడా మహా క్యాబినెట్ నిర్ణయించింది.

ఇక ఈ బిల్లులను అసెంబ్లీ ఉభయ సభలు ఆమోదించిన వెంటనే అమలులోకి తెస్తామని రాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ మీడియాకు తెలిపారు. అత్యాచార బాధితురాలి పేరును గోప్యంగా ఉంచే నిబంధననూ ఇందులో పొందుపరిచామని, వేధింపుల విషయంలోనూ బాధితుల పేర్లను మీడియా బహిర్గతం చేసేందుకు వీలుండదని ఆయన అన్నారు.

యాసిడ్ దాడికి పాల్పడిన నిందితులపై నాన్ బెయిలబుల్ కేసు నమోదవుతుందని, దోషిగా తేలితే, కనిష్ఠంగా పదేళ్ల నుంచి జీవిత ఖైదు వరకూ విధించడంతో పాటు రూ. 10 లక్షల జరిమానాను విధించి, ఆ డబ్బును బాధితురాలికి అందిస్తామని, నేర తీవ్రతను బట్టి మరణ దండన కూడా విధించే అవకాశముందని ఆయన తెలిపారు.

More Telugu News