BSE: నష్టాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్లు.. 13 శాతం పతనమైన ఐఆర్సీటీసీ!

  • ఐఆర్సీటీసీలో వాటాల విక్రయానికి కేంద్రం ప్రతిపాదన
  • అర శాతానికి పైగా నష్టపోయిన బెంచ్ మార్క్ సూచికలు
  • నష్టాల్లో కొనసాగిన ఆసియా మార్కెట్లు
Stock Makets Down From All Time High

ఇటీవలి కాలంలో నిత్యమూ లాభపడుతూ, రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న భారత స్టాక్ మార్కెట్ నేడు గరిష్ఠ స్థాయుల నుంచి కిందకు జారాయి. సెషన్ ఆరంభంలోనే ఈక్విటీలను విక్రయించేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. ఐఆర్సీటీసీలో 20 శాతం వాటాను విక్రయించేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేసినట్టు ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రకటన ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీయగా, సంస్థ ఈక్విటీ విలువ ఏకంగా 13 శాతం నష్టపోయింది.

ఈ ఉదయం 11 గంటల సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే 238 పాయింట్లు పడిపోయి 0.52 శాతం నష్టంతో 45,864 పాయింట్లకు చేరింది. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ సూచిక 92 పాయింట్ల నష్టంతో 0,68 శాతం పడిపోయి 13,436 పాయింట్ల వద్ద నడుస్తోంది.

సెన్సెక్స్ 20 అల్ట్రా సిమెంట్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, సన్ ఫార్మా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎన్టీపీసీ, ఎంఅండ్ఎంలు ఒకటి నుంచి 2 శాతం వరకూ నష్టపోయాయి. నెస్లే ఇండియా, ఆసియన్ పెయింట్స్, మారుతి సుజుకి, టైటాన్, ఐటీసీ తదితర సంస్థలు అర శాతానికి పైగా లాభాల్లో నడుస్తున్నాయి.

ప్రపంచ మార్కెట్లన్నీ నష్టాల్లో ఉండటం, ముఖ్యంగా నేటి ఆసియా మార్కెట్లలో కొనసాగుతున్న అమ్మకాలు కూడా సెన్సెక్స్, నిఫ్టీలను నష్టాల వైపు నడిపించాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆసియా మార్కెట్లలో నిక్కీ 0.21 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.44 శాతం, హాంగ్ సెంట్ 0.49 శాతం, తైవాన్ వెయిటెడ్ 1.03 శాతం, కోస్పీ 0.34 శాతం నష్టపోగా, సెట్ కాంపోజిట్ 0.25 శాతం, జకార్తా కాంపోజిట్ 0.66 శాతం లాభాలను నమోదు చేశాయి.

More Telugu News