GHMC: నేరేడ్ మెట్ లో టీఆర్ఎస్ విజయం... కన్నీరు పెట్టుకున్న బీజేపీ అభ్యర్థి ప్రసన్న!

  • ఇంతకుముందు లెక్కించని ఓట్లను లెక్కబెట్టిన అధికారులు
  • 782 ఓట్ల మెజారిటీతో మీనా ఉపేందర్ విజయం
  • తనకు అన్యాయం జరిగిందన్న ప్రసన్న నాయుడు
TRS Wins Neredment Division

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా నేరేడ్ మెట్ డివిజన్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి విజయం సాధించారని కొద్దిసేపటి క్రితం రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ ఉదయం ఓట్ల లెక్కింపును ప్రారంభించిన అధికారులు, 782 ఓట్ల మెజారిటీతో మీనా గెలిచినట్టు స్పష్టం చేశారు. కాగా, ఇప్పటికే మీనా 504 ఓట్ల ఆధిక్యంలో ఉండగా, కౌంటింగ్ నిలిపిన 544 ఓట్లు (స్వస్తిక్ కాకుండా ఇతర గుర్తులు బ్యాలెట్ పై ఉన్నవి) ఈ ఉదయం లెక్కించారు.

కాగా, ఎన్నికల ఫలితం వెల్లడైన అనంతరం, అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారంటూ బీజేపీ తరఫున పోటీ పడిన ప్రసన్న నాయుడు కన్నీటి పర్యంతం అయ్యారు. తొలి రౌండ్ లో తిరస్కరించబడిన ఓట్లను రెండో రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్థి ఖాతాలో కలిపారని, దీనిపై తాను న్యాయపోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు.

ఈ విషయంలో రిటర్నింగ్ అధికారి తనకు అన్యాయం చేశారని, మొదట తాను ప్రశ్నించినప్పుడు పొరపాటు జరిగిందని పేర్కొన్న ఆర్ఓ వీణ, ఆపై తనకు అన్యాయం చేస్తూ, 1,300 ఓట్లను టీఆర్ఎస్ ఖాతాలో వేశారని ఆమె ఆరోపించారు. ఈ విషయమై తాను కౌంటింగ్ జరిగిన రోజునే ఫిర్యాదు చేశానని తెలిపారు.

More Telugu News