Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కు ఇంకో చుక్కెదురు... పెన్సిల్వేనియా ఎన్నికల పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు!

USA Supreme Court Rejects Trump Election Appeal On Pennsylvania
  • అధ్యక్ష ఎన్నికలు జరిగి నెల రోజులు
  • ఇంకా ఓటమిని అంగీకరించని ట్రంప్
  • కింది కోర్టు తీర్పునే ఖరారు చేసిన సుప్రీంకోర్టు
అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరిగి నెల రోజులు దాటినా కూడా, ఇంకా తన ఓటమిని అంగీకరించకుండా కోర్టుల చుట్టూ తిరుగుతూ, ఓటింగ్ లో అక్రమాలు జరిగాయని నిరూపించాలని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్ కు మరో కోర్టులోనూ చుక్కెదురైంది. పెన్సిల్వేనియాలో జరిగిన ఓటింగ్ సర్టిఫికేషన్ లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ట్రంప్ టీమ్ కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది.

పెన్సిల్వేనియా ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలూ జరగలేదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మొత్తం 9 మంది న్యాయమూర్తులున్న బెంచ్ ఈ కేసును విచారించింది. ఇందులో ట్రంప్ నియమించిన ముగ్గురు న్యాయమూర్తులు కూడా ఉండటం గమనార్హం. వారు కూడా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనడానికి ఆధారాలు ఉన్నట్టు పేర్కొనలేదు.

కాగా, నవంబర్ 3న ఎన్నికలు జరుగగా, డెమోక్రాట్ల తరఫున బరిలో నిలిచిన జో బైడెన్, దాదాపు 70 లక్షల ఓట్లను అధికంగా సాధించి విజయం సాధించారని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తుండగా, ట్రంప్ మాత్రం అంగీకరించడం లేదు. పలు రాష్ట్రాల్లోని కోర్టుల్లో ట్రంప్ టీమ్ డజన్ల కొద్దీ పిటిషన్లను దాఖలు చేసింది.

డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య గట్టి పోటీ కొనసాగిన పెన్సిల్వేనియాలో మెయిల్ ద్వారా వచ్చిన బ్యాలెట్ల చెల్లుబాటును ట్రంప్ టీమ్ సభ్యుడు మైక్ కెల్లీ సవాల్ చేయగా, తొలుత పెన్సిల్వేనియా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కేసును కొట్టివేసింది. ఆపై సుప్రీంకోర్టును ట్రంప్ టీమ్ ఆశ్రయించగా, తాజా తీర్పు కూడా ట్రంప్ కు వ్యతిరేకంగానే రావడం గమనార్హం.
Donald Trump
Joe Biden
Pennsylvania
Verdict

More Telugu News