Eluru: ఏలూరు బాధితుల రక్తంలో పరిమితికి మించిన సీసం, నికెల్!

Lead and Nikel Found in Eluru Mistary Disease Victims Blood
  • నమూనాలను పరిశీలించిన వైద్య బృందాలు
  • మరింత పరిశీలన కోసం ఎయిమ్స్ కు నమూనాలు
  • ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రబలిన వింతవ్యాధికి కారణం ఏంటో దాదాపుగా తేలిపోయింది. బాధితుల రక్త నమూనాలను సేకరించిన వైద్య బృందాలు, వారి రక్తంలో సీసంతో పాటు, నికెల్ తదితర లోహాల అవశేషాలు పరిమితికి మించి వున్నాయని వెల్లడించారు. ఇది కలుషిత నీరు తాగిన కారణంగానే అయ్యుండవచ్చని, గాలి ద్వారా వ్యాపించే వ్యాధి ఎంతమాత్రమూ కాదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలియజేశారు.

బాధితుల నుంచి నమూనాలు సేకరించిన నిపుణుల కమిటీ వాటిని ఇతర రాష్ట్రాల్లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కేంద్రాలు, వైరాలజీ ల్యాబ్లకు పంపించిన సంగతి తెలిసిందే. అయితే, రక్తంలోకి లెడ్, నికెల్ లోహాలు ఎలా చేరుంటాయనడానికి మాత్రం ఇంకా సమాధానం లభించలేదు. ఏలూరులో గత వారం రోజులుగా ప్రజలు వాడిన నీరు, పాలు, ఆహార పదార్థాల శాంపిల్స్ ను కూడా సేకరించిన అధికారులు, అన్నింటినీ పరిశీలిస్తున్నారు.

కలుషిత ఆహారం లేదా నీటిని తీసుకోవడం వల్లే ఈ వ్యాధికి గురవుతున్నారని నిపుణులు చెబుతున్నా, అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. తలనొప్పి, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్న వారితో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ఇదే సమయంలో కోలుకుంటున్న వారి సంఖ్య కూడా అధికంగా ఉంది. ఇప్పటివరకూ దాదాపు 600 మందికి ఈ వింత వ్యాధి సోకగా, 450 మందికి పైగా చికిత్స తరువాత డిశ్చార్జ్ అయ్యారు. పరిస్థితి విషమంగా ఉందని భావించిన కొందరిని మాత్రం మెరుగైన చికిత్స నిమిత్తం విజయవాడకు తరలించారు.
Eluru
Hospitals
Lead
Nikel
Blood Samples

More Telugu News