Bandi Sanjay: భారత్ బంద్‌లో సీఎం కేసీఆర్‌ ఎందుకు పాల్గొనలేదు?.. బంద్ ఫ్లాప్ అయింది: బండి సంజయ్

Why KCR didnt participated in Bharat Bandh asks Bandi Sanjay
  • టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా బంద్ చేపట్టింది
  • ఉద్యోగ సంఘాల నేతలు పద్ధతి మార్చుకోవాలి
  • కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారు
సీఎం కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. భారత్ బంద్ కు మద్దతు పలికిన కేసీఆర్ ఆ కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదని ప్రశ్నించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఓటమి నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే టీఆర్ఎస్ నేతలు బంద్ చేశారని ఎద్దేవా చేశారు.

ప్రభుత్వం అధికారికంగా బంద్ ను చేపట్టిందని... కానీ బంద్ కు ప్రజాస్పందన రాలేదని అన్నారు. బంద్ పూర్తిగా విఫలమైందని చెప్పారు. రైతుల శ్రేయస్సు కోసమే ప్రధాని మోదీ వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని... కొత్త చట్టాలను రైతులు కూడా ఆమోదించారని, అందుకే తెలంగాణలో భారత్ బంద్ విఫలమైందని అన్నారు.

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సంజయ్ డిమాండ్ చేశారు. ఐఆర్, పీఆర్సీ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్ తో అన్ని మున్సిపల్ కేంద్రాల్లో త్వరలోనే ఆందోళన కార్యక్రమాలను చేపడతామని చెప్పారు. బీజేపీ చేపట్టే ఆందోళన కార్యక్రమాలకు ఉద్యోగ సంఘాల నేతలు మద్దతు తెలపాలని... లేకపోతే వారి సంగతి చూస్తామని హెచ్చరించారు. సంఘాల నేతలు తమ సమస్యల గురించి పట్టించుకోవడం లేదని ఉద్యోగులే తమకు ఫోన్లు చేసి, ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారు.

సీఎం, మంత్రుల మోచేతి నీళ్లను ఉద్యోగ సంఘాల నేతలు తాగుతున్నారని సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడూ టీఆర్ఎస్ ప్రభుత్వమే ఉండదనే విషయాన్ని ఉద్యోగ సంఘాల నేతలు గుర్తుంచుకోవాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని చెప్పారు.

ఎల్ఆర్ఎస్ పేరుతో అడ్డగోలుగా దోచుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఉద్యోగ సంఘాల నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా బంద్ లో పాల్గొన్న టీఆర్ఎస్ నేతలు, మంత్రులను ఎందుకు గృహనిర్బంధం చేయలేదని పోలీసులను ఉద్దేశించి ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని... కాని, కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారని మండిపడ్డారు. తాము చేపట్టే ఆందోళనలకు కూడా పోలీసులు సహకరించాలని కోరారు.
Bandi Sanjay
BJP
KCR
TRS
Bharat Bandh

More Telugu News