Prakash Badal: సీనియర్ రాజకీయవేత్త ప్రకాశ్ సింగ్ బాదల్ కు ఫోన్ చేసిన మోదీ

  • బాదల్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మోదీ
  • నిన్ననే మోదీకి లేఖ రాసిన బాదల్
  • రైతుల పట్ల ఔదార్యాన్ని ప్రదర్శించాలని లేఖలో కోరిన వైనం
PM Modi Dials Ex Ally Parkash Badal

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి ప్రకాశ్ సింగ్ బాదల్ (93) కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మోదీ ఫోన్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మొన్నటి వరకు బాదల్ కు చెందిన శిరోమణి అకాలీదళ్ కూడా ఎన్డీయేలో భాగస్వామిగా ఉండేది. పార్లమెంటులో కొత్త వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టిన తర్వాత వాటిని నిరసిస్తూ ఎన్డీయే నుంచి ఆ పార్టీ బయటకు వచ్చింది. కేంద్ర మంత్రి పదవులను సైతం వదులుకుంది.

మరోవైపు, నిన్ననే మోదీకి బాదల్ లేఖ రాశారు. మూడు కొత్త రైతు చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన రైతుల పట్ల ఔదార్యాన్ని ప్రదర్శించాలని లేఖలో ప్రధానిని ఆయన కోరారు. తీవ్రమైన చలిలో రైతులు రోడ్లపై ఉంటున్నారని... వారి గురించి కుటుంబసభ్యులు ఎంతో ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు పేజీల తన లేఖలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి చేసిన గొప్ప పనులను, ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ అంశాన్ని బాదల్ పేర్కొన్నారు. ఎమర్జెన్సీ సమయంలో నియంతృత్వానికి వ్యతిరేకంగా తాను పోరాడానని చెప్పారు. అహింసాయుత ప్రజాస్వామ్య విధానాలకు విలువ ఇస్తే... ఎలాంటి క్లిష్టమైన సమస్యకైనా పరిష్కారం కనుక్కోవచ్చని సూచించారు.

మరోవైపు, రైతులకు సంఘీభావంగా తనకు వచ్చిన పద్మవిభూషణ్ అవార్డును కూడా బాదల్ వెనక్కి ఇచ్చేసిన సంగతి  తెలిసిందే. పంజాబ్ ముఖ్యమంత్రిగా బాదల్ ఐదు సార్లు వ్యవహరించారు.

  • Loading...

More Telugu News