Haim Eshed: 'నిజమే.. ఏలియన్స్ భూమిపై వున్నారంటున్న' ఇజ్రాయెల్ మాజీ జనరల్!

  • దశాబ్దాలుగా కొనసాగుతున్న ఏలియన్స్ పై చర్చ
  • గ్రహాంతర వాసుల ఉనికి నిజమేనంటూ వాదనలు
  • హాలీవుడ్ లోనూ ఏలియన్స్ పై సినిమాలు
  • ఏలియన్స్ ప్రజల్లో కలిసిపోయారన్న ఇజ్రాయెల్ మాజీ జనరల్
  • అమెరికా, ఇజ్రాయెల్ ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నారని వెల్లడి
  • ఈ విషయం ట్రంప్ కూడా తెలుసన్న మాజీ జనరల్
Israel former space security chief tells about aliens

ఏలియన్స్ (గ్రహాంతరవాసులు) ను ప్రత్యక్షంగా చూసినవాళ్లు కానీ, అందుకు సంబంధించిన నిర్ధారిత ఫొటోలు కానీ ఇప్పటికీ లభ్యం కాలేదు. అయినప్పటికీ ఏలియన్స్ ఉన్నారంటూ ప్రపంచవ్యాప్తంగా వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. హాలీవుడ్ లో గ్రహాంతర వాసులపై వచ్చిన సినిమాలన్నీ దాదాపు హిట్టయ్యాయి. ఏలియన్స్ పై ప్రజల్లో ఉన్న ఆసక్తే ఆయా సినిమాల సక్సెస్ కు కారణం అనడంలో సందేహంలేదు.

తాజాగా ఈ గ్రహాంతర వాసుల గురించి ఇజ్రాయెల్ కు చెందిన అంతరిక్ష భద్రత విభాగం మాజీ జనరల్ హైమ్ ఎషెడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 87 ఏళ్ల హైమ్ ఎషెడ్ ప్రస్తుతం ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, గ్రహాంతరవాసుల ఉనికి నిజమేనని అన్నారు. వారు ప్రజల్లోనే కలిసిపోయి తిరుగుతున్నారని వివరించారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలతో ఏలియన్స్ ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నారని వెల్లడించారు. భూమండలంపై ప్రయోగాలు చేసేందుకు వారు అమెరికా ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారని వెల్లడించారు.

మానవులు, అంతరిక్ష జీవుల మధ్య ఒప్పంద వేదికగా గాలాక్టిక్ ఫెడరేషన్ ఏర్పాటైందని, అంగారక గ్రహంలో ఓ అండర్ గ్రౌండ్ స్థావరం కూడా ఉందని, అందులో అమెరికన్ వ్యోమగాములు, ఏలియన్ ప్రతినిధులు ఉన్నారని హైమ్ ఎషెడ్ వెల్లడించారు. ఈ విషయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కూడా తెలుసని, అయితే ఆయన ఈ వివరాలు బహిర్గతం చేసేందుకు ఉబలాటపడిన సమయంలో గాలాక్టిక్ ఫెడరేషన్ నచ్చచెప్పిందని, దాంతో ఆయన వెనక్కి తగ్గారని ఎషెడ్ తెలిపారు.

అయితే ఇదంతా వినడానికి ఓ కల్పిత గాథలా అనిపిస్తుందని, కానీ తాను చెప్పిన విషయాలు నిజమేనని స్పష్టం చేశారు. ఇవే విషయాలను తాను ఐదేళ్ల కిందట చెప్పి ఉంటే తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో పడేసేవాళ్లని తెలిపారు. ఇప్పుడు తాను పనిచేస్తున్న విద్యాసంస్థలోనూ.. తనను మతి భ్రమించినవాడిలా చూశారని పేర్కొన్నారు.

అయితే వీటికి సంబంధించిన వ్యవహారాల్లో తనకు డిగ్రీలు, అవార్డులు ఎన్నో వచ్చాయని, ఈ విషయాలు వెల్లడించినందు వల్ల తాను నష్టపోయేదేమీ లేదని, తెలిపారు. హైమ్ ఎషెడ్ ఇజ్రాయెల్ స్సేస్ సెక్యూరిటీ ప్రోగ్రామ్ కు మూడు దశాబ్దాల పాటు అధిపతిగా వ్యవహరించారు. అంతేకాదు, ఇజ్రాయెల్ ప్రభుత్వం ప్రదానం చేసే సెక్యూరిటీ అవార్డును మూడుసార్లు అందుకున్నారు.

More Telugu News