Anna Hazare: నిరాహార దీక్షకు దిగిన అన్నా హజారే.. దేశ వ్యాప్తంగా ప్రజలంతా నిరసన తెలపాలని పిలుపు

  • నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దీక్ష
  • స్వగ్రామం రాలేగావ్‌ సిద్ధిలో నిరసన
  • స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్ 
Anna Hazare on day long hunger strike to support farmers

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా దేశ వ్యాప్తంగా పలువురు ప్రముఖులు కూడా నిరసన తెలుపుతున్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ తన స్వగ్రామమైన రాలేగావ్‌ సిద్ధిలో సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే కూడా ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగారు. కేంద్ర ప్రభుత్వ తీరుకి నిరసనగా కొన్ని రోజులుగా ఎలాంటి ఉద్రిక్తతలు లేకుండా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.

వారికి మద్దతుగా దేశమంతటా ప్రజలు ఆందోళన చేపట్టాలని తాను కోరుతున్నానని తెలిపారు. రైతులంతా రోడ్లపైకి వచ్చి నిరసన తెలపాలని, ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని, రైతుల డిమాండ్లను పరిష్కరిస్తుందని చెప్పారు. ఈ ఆందోళనల్లో హింసాత్మక చర్యలకు మాత్రం  పాల్పడకూడదని ఆయన చెప్పారు. ‌ స్వామినాథన్‌ కమిషన్‌ చేసిన సిఫార్సులను వెంటనే అమలు చేయాలని, అగ్రికల్చరల్‌ కాస్ట్‌ అండ్‌ ప్రైసెస్‌ కమిషన్ కి స్వయం ప్రతిపత్తి కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

More Telugu News