Bandi Sanjay: రేపు జరిగే బంద్ కేవలం టీఆర్ఎస్ పార్టీ కృత్రిమ బంద్... రైతులు మోసపోవద్దు: బండి సంజయ్

  • భారత్ బంద్ కు పిలుపునిచ్చిన రైతులు
  • మద్దతు పలికిన కేసీఆర్
  • ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ కు మతిపోయిందన్న సంజయ్
  • ప్రజల దృష్టి మరల్చేందుకే బంద్ అంటున్నాడని వెల్లడి
  • బంద్ కు రైతులెవరూ మద్దతు పలకొద్దని విజ్ఞప్తి
Bandi Sanjay appeals farmers do not support tomorrow bandh

రేపటి భారత్ బంద్ కు టీఆర్ఎస్ పార్టీ గట్టిగా మద్దతు పలకడంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. రేపు జరిగే బంద్ టీఆర్ఎస్ పార్టీ చేపట్టే కృత్రిమ బంద్ మాత్రమేనని స్పష్టం చేశారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ప్రజల తీర్పుతో మతిపోయిన కేసీఆర్, ఆ ఫలితాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే బంద్ కు పిలుపునిచ్చాడని విమర్శించారు. ఈ కృత్రిమ బంద్ కు రైతులెవరూ మద్దతు పలకవద్దని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిపారు.

కేసీఆర్ విచిత్రమైన వ్యవహార శైలి చూస్తూ తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటోందని విమర్శించారు. నూతన వ్యవసాయ చట్టంతో రైతులకు ఏం నష్టం జరుగుతుందో చెప్పలేని కేసీఆర్ అకారణంగా వ్యతిరేకించడం సిగ్గుచేటని పేర్కొన్నారు.

"రైతులు పండించిన పంటలకు స్వయంగా ధరలను నిర్ణయించడంలో తప్పేముంది? పండించిన పంటను దేశంలో ఎక్కడైనా గిట్టుబాటు ధరకు అమ్ముకునే అవకాశం కల్పించడాన్ని వ్యతిరేకిస్తారా? రైతులకు అన్యాయం జరిగితే మూడు రోజుల్లో సమస్య పరిష్కరించడాన్ని వ్యతిరేకిస్తారా? కొత్త వ్యవసాయ చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో కేసీఆర్ ఇప్పటికైనా స్పష్టం చేయాలి.

సన్నవడ్లు పండించే విషయంలో కేసీఆర్ తెలంగాణ రైతుల పొట్టగొట్టాడు. సన్నవడ్లు వేయాలని రైతులను ఆదేశించి, తన ఫాంహౌస్ లో మాత్రం దొడ్డువడ్లు పండించిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి కేసీఆర్. కేసీఆర్ ఫాంహౌస్ లో పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు... రైతులు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలా? ఇదేం న్యాయం?" అంటూ ధ్వజమెత్తారు.

అదే క్రమంలో బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీపైనా స్పందించారు. దేశంలో ఏనాడూ రైతుల పట్ల కనీస కనికరం చూపని కాంగ్రెస్ నేడు కృత్రిమ ఉద్యమాలకు మద్దతు ఇవ్వడం సిగ్గుమాలిన చర్య అని వ్యాఖ్యానించారు.

More Telugu News