Three Member Committee: ఏలూరు ఘటనపై అత్యవసర అధ్యయనానికి ముగ్గురు సభ్యులతో కమిటీ

  • ఏలూరులో విజృంభిస్తున్న వింత వ్యాధి
  • కారణాలు తెలియక తలలు పట్టుకుంటున్న అధికారులు
  • వందల సంఖ్యలో బాధితులు
  • ఎయిమ్స్ ప్రొఫెసర్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ
  • రేపు సాయంత్రానికి నివేదిక ఇవ్వాలన్న కేంద్రం
Centre appoints three member committee to study Eluru issue

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వింత వ్యాధి ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్రం స్పందించింది. ఏలూరు ఘటనపై అత్యవసర అధ్యయనానికి కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ ముగ్గురు సభ్యులతో కమిటీ నియమించింది. ఢిల్లీ ఎయిమ్స్ ఎమర్జెన్సీ మెడిసిన్ ప్రొఫెసర్ జంషెడ్ నాయర్ సారథ్యంలో ఈ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులుగా పుణే జాతీయ వైరాలజీ ఇన్ స్టిట్యూట్ నిపుణుడు అవినాశ్ దేవ్, ఎన్సీడీసీ ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ సంకేత కులకర్ణి నియమితులయ్యారు. ఈ త్రిసభ్య కమిటీ రేపు ఉదయానికి ఏలూరు చేరుకోనుంది. రేపు సాయంత్రానికి నివేదిక ఇవ్వాలంటూ ముగ్గురు సభ్యులను కేంద్రం ఆదేశించింది.

కాగా, ఏలూరులో వింత జబ్బు బాధితుల సంఖ్య 443కి పెరిగింది. ప్రధానంగా మూర్ఛ లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య అధికంగా ఉంది. కాగా, ఇప్పటివరకు 243 మంది కోలుకున్నారు. మరికొందరిని మెరుగైన చికిత్స కోసం విజయవాడ తరలించారు. బాధితుల్లో ఎక్కువ మంది 30 ఏళ్ల లోపువారే ఉన్నట్టు గుర్తించారు. ఏం జరిగిందో అర్థమయ్యే లోపే కిందపడిపోయామని బాధితులు చెబుతుండడంతో వ్యాధి ఏమై ఉంటుందన్న దానిపై వైద్యుల్లో అయోమయం నెలకొంది.

More Telugu News