Raghu Rama Krishna Raju: ఏలూరు 'వింతజబ్బు'పై సీఎం జగన్ కు లేఖ రాసిన ఎంపీ రఘురామకృష్ణరాజు

  • ఏలూరులో వింతరోగం.. హడలిపోతున్న ప్రజలు
  • రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు కలత చెందుతున్నారన్న రఘురామ
  • ఏలూరులో అదనపు వైద్య సదుపాయాల ఏర్పాటుకు విజ్ఞప్తి
  • వ్యక్తిగత శ్రద్ధ చూపాలంటూ సీఎం జగన్ కు వినతి
MP Raghurama Krishnaraju writes to CM Jagan over Eluru decease

బైపాస్ సర్జరీ చేయించుకున్న కారణంగా కొన్నాళ్లుగా మీడియాలో కనిపించని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు తాజాగా సీఎం జగన్ కు లేఖ రాశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు వింతజబ్బు బారినపడి తీవ్ర భయాందోళనలకు గురవుతున్న నేపథ్యంలో రఘురామకృష్ణరాజు ఈ లేఖ రాశారు. హఠాత్తుగా సంభవించిన ఈ అనారోగ్య విపత్తు కారణంగా ఏలూరు ప్రజలే కాకుండా రాష్ట్ర ప్రజలందరూ తీవ్రంగా కలత చెందుతున్నారని వివరించారు.

ఏలూరు కార్పొరేషన్ పరిసరాల్లో ఆరోగ్య అత్యయిక పరిస్థితి ప్రకటించాలని, ఇతర ప్రాంతాల నుంచి కూడా వైద్యులను ఏలూరు రప్పించి, అవసరమైన విరుగుడు ఔషధాలు తెప్పించి, అదనపు వైద్య సదుపాయాలు అందుబాటులోకి తేవాలని సీఎంను కోరారు. ఈ సంక్షోభంపై ఎయిమ్స్ డాక్టర్లతోనూ, ప్రపంచవ్యాప్తంగా నిపుణులైన డాక్టర్లతోనూ వ్యక్తిగతంగా చర్చించి దీనికో పరిష్కారం కనుగొనాలని రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు.

దయచేసి ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ)కి చెందిన డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డితో ఈ విషయం చర్చిస్తే ఏదైనా ఫలితం ఉండొచ్చని, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో వారికి అత్యుత్తమ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ (ఆర్ అండ్ డి) సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. ఇంతటి తీవ్ర విపత్కర పరిస్థితుల్లో వ్యక్తిగత శ్రద్ధ చూపాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని కోరుతున్నానంటూ సీఎం జగన్ కు విజ్ఞప్తి చేశారు. 

More Telugu News