parakala prabhakar: అమరావతి ఆందోళనలపై పరకాల ప్రభాకర్ డాక్యుమెంటరీ

  • ప్రసాద్ ల్యాబ్స్‌లో ప్రదర్శన
  • అమరావతి రైతుల ఆందోళనను ప్రపంచానికి తెలియజేసేందుకే
  • వచ్చేవారం ప్రపంచవ్యాప్తంగా విడుదల
parakala prabhakar documentary on Amaravathi

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ సలహాదారు పరకాల ప్రభాకర్ ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. దీనికి ‘రాజధాని విషాదం-అమరావతి’ అని పేరు పెట్టారు.  హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆదివారం ఈ డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అనంతరం పరకాల ప్రభాకర్ మాట్లాడుతూ.. అమరావతి రైతుల ఆందోళనను ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశంతోనే ఈ డాక్యుమెంటరీని రూపొందించినట్టు చెప్పారు.

దీనికోసం సమగ్రంగా అధ్యయనం చేసినట్టు చెప్పారు. అమరావతి విషయంలో తలెత్తిన అనేక ప్రశ్నలకు సరైన సమాధానం రావాలన్నదే తన అభిప్రాయమన్నారు. దేశంలోని ప్రతి రాష్ట్రానికి రాజధానులు ఉన్నాయని, కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే రాజధాని ఏదో తెలియని మీమాంశలో ప్రజలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తొలుత మద్రాసు నుంచి కర్నూలు, ఆ తర్వాత హైదరాబాద్‌కు, అక్కడి నుంచి అమరావతికి రాజధానులు మారాయని, ఇలా ఇంకెంతకాలం రాజధానులను మార్చుకోవాలని ప్రశ్నించారు. వచ్చేవారం చివర్లో ఈ డాక్యుమెంటరీని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్టు ప్రభాకర్ తెలిపారు. అలాగే, యూట్యూబ్‌తోపాటు ఓటీటీ ప్లాట్‌ఫాంలోనూ దీనిని విడుదల చేయనున్నట్టు చెప్పారు.

More Telugu News