Telangana: ఈసారి తనకు పీసీసీ చీఫ్ పదవి ఖాయమంటున్న కోమటిరెడ్డి.. రేసులో పలువురు నేతలు!

  • చక్కర్లు కొడుతున్న రేవంత్‌రెడ్డి, భట్టి, శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి పేర్లు
  • పరిగణనలోకి సామాజిక సమీకరణాలు
  • పార్టీలో సుదీర్ఘంగా ఉన్న వారికే ఇవ్వాలంటున్న నేతలు
Komatireddy in TPCC Chief Race

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ పదవికి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానం కోసం పలువురు నేతలు పోటీపడుతున్నారు. వీరిలో ప్రధానంగా పార్టీ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు డి.శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి తదితరులు అధ్యక్ష పీఠాన్ని ఆశిస్తున్నారు. సారథ్య బాధ్యతలను తనకు అప్పగించాలని కోమటిరెడ్డి కోరినట్టు తెలుస్తోంది. అంతేకాదు, ఈసారి ఆ పదవి తనకు ఖాయమని సన్నిహితులతో చెప్పినట్టు సమాచారం.

అలాగే, తెలంగాణకు భవిష్యత్ నాయకుడిగా చెప్పుకుంటున్న రేవంత్‌రెడ్డి కూడా పీసీసీ పదవిని ఆశిస్తున్న వారి జాబితాలో ఉన్నారు. అయితే, సామాజిక సమీకరణాలను బట్టి శ్రీధర్‌బాబు, భట్టి విక్రమార్క సహా మరికొందరి పేర్లను అధిష్ఠానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. 2023 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త సారథి నియామకం ఉంటుందని చెబుతున్నారు. అయితే, సుదీర్ఘంగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికే పీసీసీ పగ్గాలు అప్పగించాలని పార్టీ నేతలు కోరుతున్నట్టు సమాచారం.

More Telugu News