Serum: 24 గంటల వ్యవధిలో మరో వ్యాక్సిన్ దరఖాస్తు... వ్యాక్సిన్ విడుదలకు కేంద్రాన్ని అనుమతి కోరిన సీరమ్ ఇనిస్టిట్యూట్

  • డీసీజీఐకి దరఖాస్తు చేసిన సీరమ్
  • కోవిషీల్డ్ ను వినియోగిస్తామని వినతి
  • ఇప్పటికే అనుమతిచ్చిన యూకే, బెహరైన్
  • వ్యాక్సిన్ సురక్షితమని వెల్లడించిన సీఐఐ
Serum Asks Permission to Center for Release Covishield

ఇండియాలో అత్యవసర వినియోగానికి తమ వ్యాక్సిన్ ను అనుమతించాలని ఫైజర్ దరఖాస్తు చేసుకున్న గంటల వ్యవధిలోనే, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారుగా ఉన్న సీరమ్ ఇనిస్టిట్యూట్, తాము ఉత్పత్తి చేస్తున్న ఆక్స్ ఫర్ట్ - ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ ను అనుమతించాలని కేంద్రాన్ని కోరింది.

ఈ మేరకు డీసీజీఐ (డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా)కు సీరమ్ దరఖాస్తు చేసింది. దీంతో 24 గంటల వ్యవధిలో భారత ప్రభుత్వానికి రెండు వ్యాక్సిన్ దరఖాస్తులు అందినట్లయింది. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ వినియోగానికి ఇప్పటికే యూకే, బెహరైన్ లు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే.

'కోవిషీల్డ్' పేరిట ఈ వ్యాక్సిన్ తయారు కాగా, ఇండియాలో మూడవ విడత ట్రయల్స్ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఈ వ్యాక్సిన్ సురక్షితమని, ఎటువంటి సైడ్ ఎఫెక్టులు రావని, దీని వాడకం ద్వారా కరోనా వ్యాప్తిని సమర్థవంతంగా అరికట్టవచ్చని సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఇదే విషయాన్ని తాము ఔషధ నియంత్రణ సంస్థకు కూడా వెల్లడించామని అన్నారు. ఐసీఎంఆర్ తో కలిసి నిర్వహించిన మూడవ దశ ట్రయల్స్ ఫలితాలను కూడా పంచుకున్నామని అన్నారు.

ఈ రిపోర్టు ప్రకారం, యూకే లో రెండు ట్రయల్స్ ను, ఇండియా, బ్రెజిల్ లో ఒక విడత ట్రయల్ ను సీరమ్ నిర్వహించింది. కాగా, చెన్నైకి చెందిన ఓ వలంటీర్ కు టీకా తీసుకున్న తరువాత తీవ్ర అనారోగ్య సమస్యలు రావడం కొంత కలకలం రేపినప్పటికీ, వ్యాక్సిన్ కారణంగా మాత్రమే అనారోగ్యం రాలేదని, అందువల్ల ట్రయల్స్ ను నిలుపబోమని కేంద్రం స్పష్టం చేసింది. తమ వ్యాక్సిన్ సరాసరిన 70 శాతం ప్రభావవంతంగా పనిచేస్తుందని గత నెలలో ఆస్ట్రాజెనికా వెల్లడించింది.

More Telugu News