Hardik Pandya: భారీ షాట్లతో విరుచుకుపడిన పాండ్య... టీ20 సిరీస్ టీమిండియాదే!

  • రెండో టీ20 మ్యాచ్ లో కోహ్లీ సేన గెలుపు
  • మొదట 194 పరుగులు చేసిన ఆసీస్
  • రాణించిన ధావన్, కోహ్లీ, రాహుల్
  • పాండ్య మెరుపుదాడి
  • రెండు బంతులు మిగిలుండగానే లక్ష్యఛేదన
Pandya strikes as Tema India clinch series against Australia

ఆస్ట్రేలియా పర్యటనలో వన్డే సిరీస్ కోల్పోయిన టీమిండియా టీ20 సిరీస్ లో ప్రతీకారం తీర్చుకుంది. మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో కైవసం చేసుకుంది. ఇవాళ సిడ్నీలో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో ఆసీస్ ను ఓడించింది. మిడిలార్డర్ లో వచ్చిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య పిడుగుల్లాంటి షాట్లతో కంగారూ బౌలర్లను చితకబాదాడు.

195 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ పాండ్య మెరుపులతో మరో రెండు బంతులు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. పాండ్య కేవలం 22 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 భారీ సిక్సులతో 42 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. చివరి ఓవర్లో 6 బంతుల్లో 14 పరుగులు చేయాల్సి ఉండగా... డేనియల్ సామ్స్ విసిరిన ఆ ఓవర్లో తొలి బంతికి రెండు పరుగులు తీసిన పాండ్య ఆ తర్వాత బంతికి భారీ సిక్స్ తో భారత శిబిరంలో సంతోషం నింపాడు. అదే ఓవర్లో నాలుగో బంతిని స్టాండ్స్ లోకి పంపి టీమిండియా విజయం ఖాయం చేశాడు.

అంతకుముందు, ఓపెనర్ శిఖర్ ధావన్ 52, మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ 30 పరుగులు చేసి జట్టుకు శుభారంభం అందించారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ (40) కూడా రాణించడంతో జట్టు గెలుపు దిశగా పయనించింది. దూకుడుగా ఆడే ప్రయత్నంలో సంజు శాంసన్ (15) అవుటైనా శ్రేయాస్ అయ్యర్ (12 నాటౌట్) జతగా పాండ్య పని పూర్తి చేశాడు.

ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 5 వికెట్లకు 194 పరుగులు చేసింది. ఇక, ఇరు జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ డిసెంబరు 8న సిడ్నీలోనే జరగనుంది.

More Telugu News