Vijayashanti: కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై... రేపు బీజేపీలో చేరనున్న విజయశాంతి..!

  • గత కొన్నాళ్లుగా విజయశాంతి పార్టీ మారుతున్నట్టు వార్తలు
  • కాంగ్రెస్ కు రాజీనామా చేశారన్న జాతీయ మీడియా
  • ఢిల్లీ చేరిన బండి సంజయ్
  • రేపు అమిత్ షాతో విజయశాంతి భేటీ!
Vijayasanthi set to join BJP

తెలంగాణ కాంగ్రెస్ నేత విజయశాంతి రేపు బీజేపీలో చేరుతున్నారని జాతీయ మీడియా వెల్లడించింది. విజయశాంతి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారని, రేపు కాషాయ కండువా కప్పుకునేందుకు ముహూర్తం కుదిరిందని ఓ జాతీయ మీడియా సంస్థ పేర్కొంది. బీజేపీలో చేరిన అనంతరం విజయశాంతి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అవుతారని వివరించింది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఇప్పటికే హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. బండి సంజయ్... రాములమ్మను బీజేపీ కార్యాలయానికి తోడ్కొని వెళతారని తెలుస్తోంది.

90వ దశకం చివర్లోనే రాజకీయ రంగప్రవేశం చేసిన విజయశాంతి ఇన్నాళ్లకు మళ్లీ సొంతగూటికి చేరుతున్నారని భావించాలి. ఆమె 1997లో బీజేపీలో చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ లో చేరారు. ఆమెకు కేసీఆర్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చి ఎంపీ సీటు కేటాయించి గెలిపించుకున్నారు. విజయశాంతిని తన చెల్లెలు అని కేసీఆర్ అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం తొలినాళ్లలో కేసీఆర్, విజయశాంతి మాత్రమే టీఆర్ఎస్ ఎంపీలుగా ఉన్నారు.

అయితే వారిద్దరి మధ్య విభేదాలు రావడంతో విజయశాంతి తల్లి తెలంగాణ పేరిట పార్టీ స్థాపించి రాజకీయంగా దెబ్బతిన్నారు. ఆపై తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అయితే కాంగ్రెస్ లో తనకు సముచిత స్థానం లేదన్న అసంతృప్తి, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య ఇమడలేకపోవడం వంటి కారణాలతో పార్టీ కార్యకలాపాల్లో పెద్దగా ఎక్కడా కనిపించలేదు. అయితే ఇటీవల బీజేపీ పెద్దలతో విజయశాంతి మంతనాలు ఫలించి, ఆమె కాషాయతీర్థం పుచ్చుకునేందుకు మార్గం సుగమం అయినట్టు తెలుస్తోంది.

More Telugu News