IYR Krishna Rao: ఇటువంటి చట్టం తేవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే అవివేకమైన చర్యే: ఐవైఆర్

  • ప్రభుత్వ సమ్మతితో ఎన్నికలు జరపడం సరికాదు
  • రాజ్యాంగం స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ స్థాయిని, బాధ్యతలను నిర్వచించింది
  • తర్వాత చట్టం దానికి వ్యతిరేకంగా ఉంటే కోర్టులు కొట్టేయడం తథ్యం
  • అప్పుడు మరలా కోర్టులను నిందిస్తే లాభం లేదు
iyr slams ap govt

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌, ఏపీ ప్రభుత్వం మధ్య చోటు చేసుకుంటోన్న పరిణామాలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ లేఖ రాయడం, స్థానిక ఎన్నికల నిర్వహణపై అసెంబ్లీ తీర్మానం రాజ్యాంగ విరుద్ధమని చెప్పిన విషయం తెలిసిందే.

భారత రాజ్యాంగంలోని 243కే అధికరణ కింద ఎన్నికల కమిషన్‌కు స్వయం ప్రతిపత్తి ఉందని, ఐదేళ్లకోసారి ఎన్నికలు జరపడం కమిషన్‌ విధని ఆయన లేఖలో పేర్కొన్న అంశాలను ఈనాడు దినపత్రికలో ప్రచురించారు. కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు సమాన అధికారాలు ఉన్నాయని, ప్రభుత్వ సమ్మతితో ఎన్నికలు జరపాలన్న నిర్ణయం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమని, అలాంటి ఆర్డినెన్స్ వస్తే తిరస్కరించాలని గవర్నర్‌కు రమేశ్ కుమార్ సూచించారు. ఈ విషయాలను ప్రస్తావిస్తూ ఏపీ సర్కారుపై ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు విమర్శలు గుప్పించారు.

‘ఇటువంటి చట్టం తేవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తే అవివేకమైన చర్యే అవుతుంది. రాజ్యాంగం స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ స్థాయిని బాధ్యతలను నిర్వచించిన తర్వాత చట్టం దానికి వ్యతిరేకంగా ఉంటే కోర్టులు కొట్టేయడం తథ్యం. అప్పుడు మరలా కోర్టులను నిందిస్తే లాభం లేదు’ అని ఐవైఆర్ చురకలంటించారు.

More Telugu News