యోగి ఫిలింసిటీ ఆశలపై నీళ్లు.. చిత్ర పరిశ్రమను ముంబై నుంచి తరలించడం సాధ్యం కాదంటూ ఉద్ధవ్‌కు నిర్మాతల సంఘం లేఖ

06-12-2020 Sun 07:30
  • సినీ రంగానికి ముంబై ఆత్మ
  • సినీ పరిశ్రమతో పలువురు మమేకమై ఉన్నారు
  • కుదేలైన సినీ పరిశ్రమకు తోడ్పాటు అందించండి
producers association writes letter to maha cm Uddhav Thackeray

ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో వెయ్యి ఎకరాల్లో అతిపెద్ద ఫిలింసిటీ ఏర్పాటు చేయాలన్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆశలు నెరవేరడం కష్టమనే సంకేతాలు వెలువడుతున్నాయి. ‘ది ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్’ సంఘం మొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేకు రాసిన లేఖలో.. సినీ రంగానికి ముంబైని హృదయం, ఆత్మగా అభివర్ణించారు.

బాలీవుడ్‌కు ముంబై హృదయం లాంటిందని, సినీరంగానికి మహారాష్ట్ర పుట్టినిల్లని పేర్కొన్నారు. అలాంటి ముంబై నుంచి సినీ పరిశ్రమను మరో చోటికి తరలించడం సాధ్యం కాదని తేల్చిచెప్పారు. నిర్మాతలు, దర్శకులు, ఆర్టిస్టులు, ఇతర టెక్నీషియన్లు, ప్రజలు అందరూ ఇక్కడి సినీ పరిశ్రమతో మమేకమై ఉన్నారని లేఖలో వివరించారు.

అయితే, కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం సినీ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయిందని, హిందీ చిత్ర పరిశ్రమను కాపాడుకుని పూర్వవైభవం తీసుకొచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అందులో కోరారు. సినీ ఇండస్ట్రీకి కావాల్సిన తోడ్పాటు అందించాలని నిర్మాతల సంఘం ఆ లేఖలో పేర్కొంది.