29 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌కు కోరె అండర్సన్ వీడ్కోలు!

06-12-2020 Sun 07:01
  • కాబోయే భార్యతో కలిసి అమెరికాలో స్థిరపడనున్న అండర్సన్
  • అమెరికా మేజర్ క్రికెట్ లీగల్‌లో ఆడనున్న ఆల్‌రౌండర్
  • మార్గరెట్ తన కోసం ఎన్నో త్యాగాలు చేసిందన్న క్రికెటర్
Newzealand all rounder corey andersong retires from international cricket

న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోరె అండర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. గత కొంతకాలంగా గాయలు వేధిస్తుండడంతో 29 ఏళ్లకే ఈ నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా అమెరికా వేదికగా జరిగే మేజర్ లీగ్‌ (ఎంఎల్‌సీ)లో మాత్రం ఆడనున్నట్టు తెలిపాడు. ఈ టీ20 లీగ్‌తో అండర్సన్ మూడేళ్లకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం అండర్సన్ మాట్లాడుతూ.. న్యూజిలాండ్‌కు ప్రాతినిధ్యం వహించినందుకు తనకు గర్వంగా ఉందన్నాడు.

తనకు కాబోయే భార్య మేరీ మార్గరెట్ తన కోసం ఎన్నో త్యాగాలు చేసిందని, కష్టకాలంలో అండగా నిలిచిందని పేర్కొన్నాడు. స్వస్థలమైన అమెరికా నుంచి న్యూజిలాండ్ వచ్చిందని, తాను గాయాలతో బాధపడినప్పుడు, ఇతర విషయాల్లో మద్దతుగా నిలిచిందని గుర్తు చేసుకున్నాడు. రిటైర్మెంట్ తర్వాత ఆమెతో కలిసి అమెరికాలో ఉండాలనుకుంటున్నానని, అక్కడి మేజర్ లీగులో ఆడతానని చెప్పాడు. అండర్సన్ తన కెరియర్‌లో 13 టెస్టులు, 49 వన్డేలు, 31 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలోనూ కలిపి 2,277 పరుగులు చేశాడు. 90 వికెట్లు పడగొట్టాడు. నవంబరు 2018లో చివరిసారి పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆడాడు.