రాహుల్ ని ఉద్దేశించి పవార్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన ఎన్సీపీ

05-12-2020 Sat 21:01
  • రాహుల్ నాయకత్వంపై పవార్ సంచలన వ్యాఖ్యలు
  • స్థిరత్వం తక్కువగా ఉందని కామెంట్
  • అభ్యంతరం వ్యక్తం చేసిన కాంగ్రెస్
  • ఒక తండ్రిలా సలహా ఇచ్చారన్న ఎన్సీపీ
  • రాహుల్ పై ఒబామా కామెంట్స్ ను పవార్ ఖండించారని వ్యాఖ్య
Sharad Pawars Partys Response On His Comment On Rahul Gandhi

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గురించి ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్రలోని అధికార కూటమిలో ఇబ్బందిని కలిగించడమే కాకుండా, దేశ వ్యాప్తంగా కొత్త చర్చకు నాంది పలికాయి. రాహుల్ గాంధీలో స్థిరత్వం కొంచెం తక్కువగా ఉందని ఆయన అన్నారు. మరాఠీ వార్తాపత్రిక 'లోక్ మాత' నిర్వహించిన ఓ కార్యక్రమంలో పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా... రాహుల్ నాయకత్వాన్ని అంగీకరించేందుకు దేశం సిద్ధంగా ఉందా? అనే ప్రశ్న పవార్ కు ఎదురైంది. దీనికి సమాధానంగా... 'ఈ అంశానికి సంబంధించి కొన్ని సందేహాలు ఉన్నాయి. స్థిరత్వం కొంచెం తక్కువగా ఉన్నట్టుంది' అని పవార్ చెప్పారు.

దీనిపై మహారాష్ట్ర కాంగ్రెస్ నేత యశోమతి ఠాగూర్ మాట్లాడుతూ, తమ నాయకత్వం చాలా బలమైనదని అన్నారు. మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వం నిలకడగా ఉండాలనుకుంటే తమ నాయకత్వంపై కామెంట్లు చేయడాన్ని మానుకోవాలని తమ సహచరులను కోరుతున్నామని చెప్పారు. సంకీర్ణ ధర్మాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని హితవు పలికారు.

దీంతో ఎన్సీపీ దిద్దుబాటు చర్యలకు దిగింది. సీనియర్ నాయకుడైన పవార్ ఒక తండ్రిలా సలహా ఇచ్చారని భావించాలని ఎన్సీపీ అధికార ప్రతినిధి మహేశ్ తపాసే చెప్పారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తన పుస్తకంలో రాహుల్ గాంధీ గురించి చేసిన కామెంట్లపై పవార్ వెంటనే స్పందించారని... ఇతర దేశాలకు చెందిన నేతల గురించి కామెంట్లు చేయడం సరికాదని పవార్ అన్నారని చెప్పారు.

టీచర్ ను ఇంప్రెస్ చేసే విద్యార్థి మాదిరి రాహుల్ ఉంటారని... సబ్జెక్ట్ లో నైపుణ్యత సాధించాలనే తపన ఆయనలో కనిపించదంటూ ఒబామా తన పుస్తకంలో రాహుల్ గురించి కామెంట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు మండిపడ్డాయి.