రూ.3.5 కోట్లు ఎగ్గొట్టాడంటే ఎంత పెద్ద బిజినెస్ మ్యానో అనుకున్నారు... తీరా చూస్తే..!

05-12-2020 Sat 18:59
  • లాదున్ ముర్ము అనే వ్యక్తి పేరిట పరిశ్రమ
  • భారీగా జీఎస్టీ బకాయిలు పడ్డ పరిశ్రమ యజమాని
  • చిరునామా వెదుక్కుంటూ వెళ్లిన పోలీసులు
  • అక్కడో రోజు కూలీని చూసి అవాక్కయిన వైనం
Police got surprised after they have seen a man instead of another

ఝార్ఖండ్ లో ఆసక్తికర సంఘటన వెలుగు చూసింది. లాదున్ ముర్ము (48) అనే వ్యక్తి రూ.3.5 కోట్ల మేర జీఎస్టీ ఎగ్గొట్టినట్టు అధికారులు గుర్తించారు. దాంతో అతడిని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులు అవాక్కయ్యారు. లాదున్ ముర్ము అనే వ్యక్తి ఓ రోజు కూలీ అని తెలుసుకుని విస్తుపోయారు. అతడి పేరుతో ఇంకెవరో పరిశ్రమ ప్రారంభించి, జీఎస్టీ బకాయిలు పడ్డారని తెలుసుకున్నారు.

రాయ్ పహాడీ ప్రాంతంలో ఎంఎస్ స్టీల్ అనే పరిశ్రమ ఉంది. లాదున్ ముర్ము పేరిట ఈ పరిశ్రమ నమోదై ఉంది. కోట్ల రూపాయల మేర జీఎస్టీ బకాయి పడడంతో ఆ కంపెనీ అధినేత చిరుమానాను వెదుక్కుంటూ రాయ్ పురి అనే గ్రామానికి వెళ్లిన పోలీసులకు ఉపాధి హామీ పథకంలో కరవు పనులకు వెళుతున్న లాదున్ ముర్ము కనిపించాడు.

పరిశ్రమ అధినేత అంటే ఎంత విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడో అనుకున్న పోలీసులకు వాస్తవ పరిస్థితి అర్థమైంది. అయితే విధి నిర్వహణలో భాగంగా లాదున్ ముర్మును అరెస్ట్ చేశారు. కానీ గ్రామస్తుల ఆందోళనతో అతడిని విడిచిపెట్టారు. దీనిపై లోతుగా విచారణ జరిపిన పోలీసులకు లాదున్ ముర్ము ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంకు ఖాతాలు, ఇతర పత్రాల సాయంతో వేరొకరు కంపెనీ స్థాపించినట్టు తెలుసుకున్నారు. కాగా, రెండేళ్ల కిందట తన పత్రాలను మేనల్లుడికి ఇచ్చినట్టు ముర్ము చెప్పడంతో ఆ దిశగా దర్యాప్తు షురూ చేశారు.