కేంద్రం ఏ ఉద్దేశంతో ఈ బిల్లులు తెచ్చిందో కానీ సవరణలు చేయాల్సిన అవసరం ఉంది: సోమిరెడ్డి

05-12-2020 Sat 14:10
  • ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల నిరసనలు
  • రైతులు ప్రాణాలు లెక్కచేయకుండా పోరాడుతున్నారన్న సోమిరెడ్డి
  • ప్రభుత్వం పట్టువిడుపుల ధోరణి చూపాలని హితవు
Somireddy reacts over farmers protests in Delhi

జాతీయ వ్యవసాయ చట్టాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గత కొన్నిరోజులుగా రైతులు ఢిల్లీలో నిరసనలు తెలియజేస్తున్నారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీలో 9 రోజులుగా రైతులు చలిలో వణుకుతూ ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడుతున్నారని వెల్లడించారు. అధికారులు భోజన సౌకర్యం కల్పిస్తామన్నా నిరాకరించి పట్టుదలగా ఉద్యమిస్తున్నారని కితాబిచ్చారు.

కేంద్రం ఏ ఉద్దేశంతో ఈ బిల్లులు తీసుకువచ్చిందో కానీ సవరణలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఎంఎస్పీని చట్టబద్ధం చేయాలని, కార్పొరేట్ కంపెనీలు రైతులకు పెట్టుబడులు పెట్టి తిరిగి వారి ఉత్పత్తులను కొనే విషయంలోనూ ఎంఎస్పీకి పైబడే అగ్రిమెంటు జరగాలని సోమిరెడ్డి సూచించారు. పేద రైతుల కష్టానికి ప్రతిఫలాన్ని కార్పొరేట్ల దయాదాక్షిణ్యాలకు వదిలేయకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు.

ప్రైవేటు సంస్థలు ఎంత సరుకునైనా నిల్వచేయవచ్చనే సౌలభ్యం వినియోగదారులకు భారంగా మారే ప్రమాదం ఉందని, వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని స్పష్టమైన విధానంతో సవరణలు చేయాలని పేర్కొన్నారు. రైతుల విషయంలో కేంద్రం పట్టువిడుపులు చూపి సత్వర నిర్ణయం తీసుకోవాలని హితవు పలికారు.