మా ఇంట్లో చెట్లు ఉండేవి కావు... అందుకే ఇక్కడ ఉండలేకపోయా: నెల్లూరులో పవన్ కల్యాణ్

05-12-2020 Sat 13:35
  • నెల్లూరులో జనసేన పార్టీ నేతలతో పవన్ సమావేశం
  • మొక్కలంటే విపరీతమైన ప్రేమ అని వివరణ
  • ఎస్సై అవ్వాలనుకున్నానని వెల్లడి
 Pawan tells his party leaders about his childhood things

జనసేనాని పవన్ కల్యాణ్ తనకు మొక్కలంటే విపరీతమైన ప్రేమ అని వెల్లడించారు. నెల్లూరులో పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో తాము నెల్లూరులో ఉన్నప్పుడు తమ ఇంట్లో చెట్లు ఉండేవి కావని, అందుకే ఇక్కడ ఉండలేకపోయానని వెల్లడించారు. తన తల్లి నెల్లూరుకు చెందినవారేనని, తాను పుట్టిపెరిగింది ఇక్కడేనని వివరించారు. అందుకే తనకు నెల్లూరు అంటే ఎంతో అభిమానం అని పవన్ కల్యాణ్ తెలిపారు.

తన వ్యక్తిగత విషయాల గురించి చెబుతూ, టెన్త్ క్లాసులో పెద్దగా మార్కులేమీ రాకపోయినా, మొత్తమ్మీద ఉత్తీర్ణుడ్నయ్యానని చెప్పారు. కొన్ని పరిస్థితుల వల్ల చదువు మధ్యలోనే నిలిపివేశానని, కానీ చదవడం మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని తన అభిరుచిని వెల్లడించారు.

అప్పట్లో పోలీస్ శాఖలో సబ్ ఇన్ స్పెక్టర్ అవ్వాలన్నది తన ఆశయంగా ఉండేదని అన్నారు. ఎస్ఐగా ప్రజలను రక్షించాలని భావించేవాడ్నని, అయితే తన ఇంట్లోనూ, బంధువుల ఇళ్లలోనూ రాజకీయ వాతావరణం ఉండడంతో తనలోనూ రాజకీయాలపై ఆసక్తి ఏర్పడిందని తెలిపారు.