రైతుల ఆందోళనలపై చర్చించేందుకు కేంద్రమంత్రులతో ప్రధాని మోదీ సమావేశం
- నూతన వ్యవసాయ చట్టాలు తీసుకువచ్చిన కేంద్రం
- తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఢిల్లీలో నిరసనలు తెలుపుతున్న రైతులు
- ఇప్పటికే కేంద్రంతో రెండు పర్యాయాలు చర్చలు

కేంద్ర వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీలో రైతులు కొనసాగిస్తున్న ఆందోళనలపై చర్చించాలని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు. ఈ నెల 8న భారత్ బంద్ కు రైతులు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆయన కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. హోమ్ మంత్రి అమిత్ షా, వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, వాణిజ్య మంత్రి పియూష్ గోయల్, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో మోదీ తన నివాసంలో భేటీ అయ్యారు.
గత కొన్నిరోజులుగా రైతులు చేపడుతున్న నిరసనలకు ముగింపు పలకాలని మోదీ భావిస్తున్నారు. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల అభ్యంతరాలు, రైతుల సమస్యలపై చర్చలే ప్రధాన అజెండాగా ఈ సమావేశం చేపట్టారు.
కాగా, కేంద్రం ఇప్పటికే నాలుగు విడతలు రైతు సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపినా సయోధ్య కుదరలేదు. కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల్లో అవగాహన కల్పించి, వారిలో నెలకొన్న అపోహలను తొలగించాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలకు చర్చలు ఏమాత్రం ఉపకరించలేదు. ప్రభుత్వం చేస్తున్న ప్రతిపాదనలను రైతులు ఏమాత్రం అంగీకరించకపోవడంతో ఢిల్లీలో నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మధ్యాహ్నం మరోసారి ఇరువర్గాల మధ్య సమావేశం జరగనుంది.




















