Jana Reddy: కాంగ్రెస్ కు భారీ షాక్.. బీజేపీలో చేరనున్న కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి?

  • త్వరలో నాగార్జునసాగర్ నియోజకవర్గానికి ఉపఎన్నిక
  • జానారెడ్డి కుమారుడిని బరిలోకి దించే యోచనలో బీజేపీ
  • ఈ ఉపఎన్నికలో సైతం విజయపతాకం ఎగురవేయాలన్న పట్టుదలతో బీజేపీ
Congress senior leader Jana Reddy to join BJP

గత కొన్ని నెలలుగా తెలంగాణలో బీజేపీ ఊహించని విధంగా బలపడుతూ వస్తోంది. రాష్ట్రంలో బలమైన నేతలుగా పేరుగాంచిన కొందరు బీజేపీలో చేరడం ఆ పార్టీకి బలాన్ని, సరికొత్త గ్లామర్ ను, ఊపును తీసుకొచ్చింది. దుబ్బాకలో టీఆర్ఎస్ ను ఓడించడం పార్టీ శ్రేణుల్లో స్థైర్యాన్ని అమాంతం పెంచింది.

అదే స్ఫూర్తితో గ్రేటర్ ఎన్నికల్లో పోరాడిన బీజేపీ... అధికార పక్షానికి పెద్ద షాకే ఇచ్చింది. టీఆర్ఎస్ పార్టీ సొంతంగా మేయర్ పదవిని చేపట్టే పరిస్థితి లేకుండా బీజేపీ కట్టడి చేసింది. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ భవిష్యత్ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేయబోతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  

మరోవైపు గ్రేటర్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం చెందింది. ఫలితాలకు నైతిక బాధ్యత వహిస్తూ టీపీసీసీ అధ్యక్ష పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేశారు. విజయశాంతి వంటి కీలక నేతలు బీజేపీలో చేరబోతున్నారు. తాజాగా మరో ఆసక్తికర వార్త వైరల్ అవుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ హోంమంత్రి జానారెడ్డి కాంగ్రెస్ కు గుడ్ చెప్పబోతున్నారనేదే ఆ వార్త. ఆయన బీజేపీలో చేరబోతున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.

టీఆర్ఎస్ నేత, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇటీవలే మృతి చెందిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో నోముల చేతిలో జానారెడ్డి ఓడిపోయారు. నోముల మృతితో ఇప్పుడు అక్కడ ఉప ఎన్నిక జరగబోతోంది. ఈ ఉపఎన్నికలో బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపబోతోందనే చర్చ అప్పుడే ప్రారంభమైంది.

టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో చేరేందుకు జానా సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆయనతో బీజేపీ నేతలు చర్చలు జరిపారని తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డిని బరిలోకి దించాలని బీజేపీ నిర్ణయించినట్టు సమాచారం. దీనికి జానారెడ్డి కూడా ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఇక్కడ కూడా గెలుపొంది సత్తా చాటాలనే యోచనలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉన్నట్టు సమాచారం.

More Telugu News