Adar Poonawala: 'ఏషియన్ ఆఫ్ ది ఇయర్' జాబితాలో అదార్ పూనావాలా!

  • మొత్తం ఆరుగురికి అవార్డులు
  • కరోనాపై పోరాటంలో ఎంతో కృషి చేస్తున్న వారికి అవార్డులు
  • ప్రకటించిన 'ది స్ట్రెయిట్స్ టైమ్స్'
Adar Poonawala is the Asian of the Year

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారుగా ఉన్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదార్ పూనావాలా మరో అరుదైన ఘనతను సాధించారు. ఈ సంవత్సరం 'ఏషియన్ ఆఫ్ ది ఇయర్' అవార్డుల్లో మొత్తం ఆరుగురికి స్థానం లభించగా, అందులో అదార్ పూనావాలా కూడా నిలిచారు. కొవిడ్ - 19 మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ఆయన ఎంతగానో కృషి చేస్తున్నారని అవార్డులను ప్రకటించిన సింగపూర్ దినపత్రిక 'ది స్ట్రెయిట్స్ టైమ్స్' పేర్కొంది.

యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్, బ్రిటన్ సంస్థ ఆస్ట్రాజెనికా సంయుక్తంగా కరోనాకు వ్యాక్సిన్ ను 'కోవిషీల్డ్' పేరిట తయారు చేయగా, దాన్ని భారీ ఎత్తున సీరమ్ తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ జాబితాలో చైనా రీసెర్చర్, కరోనా గురించి తొలిసారిగా ఆర్టికల్ ను ఆన్ లైన్ లో ప్రచురించిన జాంగ్ యూంగ్ జెన్, అదే దేశానికి చెందిన మేజర్ జనరల్ చెన్ వేయ్, జపాన్ కు చెందిన డాక్టర్ రుయిచి మోరిషితా, సింగపూర్ ప్రొఫెసర్ ఓయ్ ఇంగ్ యాంగ్ ల పేర్లు కూడా ఉన్నాయి.

ఈ ఆరుగురూ కరోనా వైరస్ ను అరికట్టేందుకు ఏదో ఒక రకంగా కృషి చేస్తున్న వారే కావడం గమనార్హం. వీరందరూ నేటి తరానికి హీరోల వంటి వారని, ఈ మహమ్మారిని పారద్రోలేందుకు తమను తాము అంకితం చేశారని ఈ సందర్భంగా 'ది స్ట్రెయిట్స్ టైమ్స్' అభివర్ణించింది. వీరితో పాటు మరెందరి కృషితో కరోనాను త్వరలోనే అంత చేయగలమన్న నమ్మకం ప్రజల్లో పెరిగిందని, ఇందులో ఆసియాకు చెందిన వారి పాత్రే అధికమని పేర్కొంది.

కాగా, 1966లో సీరమ్ ఇనిస్టిట్యూట్ ను అదార్ పూనావాలా తండ్రి సైరస్ పూనావాలా స్థాపించారు. ఆపై 2001లో సంస్థలో చేరిన అదార్, 2011లో సీఈఓగా ఎదిగారు. ఆపై సంస్థలో దాదాపు 250 మిలియన్ డాలర్ల పెట్టుబడులను కుటుంబ ఆస్తుల నుంచి పెట్టిన అదార్, కంపెనీ తయారీ సామర్థ్యాన్ని ఎంతగానో పెంచారు.

More Telugu News