ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి: బీజేపీ విజయంపై పవన్ కల్యాణ్

05-12-2020 Sat 09:43
  • బండి సంజయ్ మరో విజయాన్ని అందుకున్నారు
  • జన సైనికుల అవిశ్రాంత కృషి కూడా తోడైంది  
  • కోరగానే జనసేన నేతలు తప్పుకున్నారన్న పవన్ కల్యాణ్
We Too Helped BJP in GHMC Says Pawan Kalyan

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ విజయం వెనుక జన సైనికుల అవిశ్రాంత కృషి కూడా తోడైందని, అందుకు తనకెంతో ఆనందంగా ఉందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ కు గట్టి పోటీని ఇచ్చి, తమ స్థానాలను 4 నుంచి 48కి పెంచుకున్న బీజేపీపై పవన్ ప్రశంసల వర్షం కురిపించారు. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా మరో విజయాన్ని అందుకున్నారని వ్యాఖ్యానించిన ఆయన, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సహా బీజేపీ నేతలకు శుభాభినందనలు తెలిపారు.

ప్రజలు మార్పును కోరుకుంటున్నారన్న సంకేతాలు స్పష్టంగా కనిపించాయని, ఇంటింటికీ తిరుగుతూ బీజేపీ, జనసేన చేసిన ప్రచారం నేడు సత్ఫలితాలను ఇచ్చిందని అన్నారు. తమ పార్టీ నేతలు 60 చోట్ల పోటీ చేయాలని భావించారని, బీజేపీ కోసం వారందరినీ విరమించుకోవాలని తాను కోరగా, ప్రతి ఒక్కరూ సహకరించారని గుర్తు చేసిన పవన్ కల్యాణ్, వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

జనసైనికుల రాజకీయ భవిష్యత్తుకు తాను భరోసాగా ఉంటానని వెల్లడించిన ఆయన, భవిష్యత్తులో బీజేపీతో కలిసి తెలంగాణలోనూ పనిచేస్తూ, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.