Carona: కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో.. న్యూ ఇయర్ జోష్ ఈ సంవత్సరం లేనట్టే!

  • కరోనా కేసులు పెరుగుతాయన్న భయం
  • అందరూ ఒక చోటకు చేరితే ప్రమాదమే
  • కఠినమైన ఆంక్షలు విధించే యోచనలో రాష్ట్రాలు
No New Year Celebrations This Year

కొత్త సంవత్సరం వస్తున్నదంటే, డిసెంబర్ 31న ఎంతగా సెలబ్రేషన్స్ జరుగుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ జోష్ ఎలా ఉంటుందో అనుభవిస్తేగాని తెలీదు. ఈ సంవత్సరం మాత్రం అంత ఉత్సాహం కనిపించే అవకాశాలు లేవు. కరోనా మహమ్మారి విజృంభణ, ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రెండో దశ మొదలు కావడంతో, పలు రకాల ఆంక్షలు కొత్త సంవత్సరం వేడుకలపై ప్రభావం చూపనున్నాయి. కొవిడ్ సాంకేతిక సలహా సమితి ఇప్పటికే ఈ మేరకు కేంద్రానికి సిఫార్సులు చేయగా, క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలపై ఆంక్షలను పలు రాష్ట్రాలు విధించనున్నాయి.

ఎక్కువ మంది ప్రజలు ఒక చోటకు చేరకుండా ఇప్పటికే ఆదేశాలు దేశవ్యాప్తంగా అమలవుతుండగా, వివాహాది శుభకార్యాలకు, రాజకీయ సమావేశాలకు మాత్రం పరిమితులతో కూడిన అనుమతులను జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇండియాలో పెళ్లికి 100 మంది, రాజకీయ సమావేశాలకు మీటింగ్ హాల్ లో 50 శాతం కెపాసిటీ లేదా 200 మంది, అంత్యక్రియలకు 50 మందికి మాత్రమే అనుమతి ఇస్తున్నారు.

ఇక ఇయర్ ఎండింగ్ సెలబ్రేషన్స్ లో నిబంధనలను అతిక్రమిస్తే, అసలే శీతాకాలం నడుస్తూ, గాలిలో కాలుష్యం పెరిగిపోయిన నేపథ్యంలో కేసులు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే ఇయర్ ఎండింగ్ వేడుకలపై ఆంక్షలు విధించే ప్రయత్నాల్లో ఉంది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించిన రాష్ట్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ సుధాకర్, డిసెంబర్ 20 నుంచి జనవరి 2 వరకూ ఆంక్షలు కఠినంగా అమలయ్యేలా మార్గదర్శకాలు రూపొందించాలని సూచించారు.

ఢిల్లీ సర్కారు సైతం ఇదే తరహా ఆలోచనలో ఉంది. క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకల కారణంగా కేసులు పెరగకుండా చూసేందుకు నిబంధనలను విధించి వాటిని పటిష్ఠంగా అమలు చేయాలని భావిస్తోంది. మిగతా రాష్ట్రాలు కూడా ఇదే ఆలోచనలో ఉన్నాయని సమాచారం.

More Telugu News