న్యూజెర్సీలో చిత్తూరు యువతి ఆత్మహత్య... భర్తే హత్య చేశాడంటున్న తల్లిదండ్రులు!

05-12-2020 Sat 07:55
  • అనుమానాస్పద స్థితిలో యువతి మరణం
  • మృతదేహం పంపించనంటున్న భర్త
  • ఫిర్యాదు చేసిన యువతి తల్లిదండ్రులు
Chittore Lady Sucide in USA

అమెరికాలోని న్యూజెర్సీలో చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువతి అనుమానాస్పద స్థితిలో కన్నుమూసింది. ఈ విషయంలో తమ కుమార్తెను భర్తే హత్య చేశాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే, పూతలపట్టు మండలానికి చెందిన త్యాగరాజులు నాయుడు కుమార్తె ప్రేమలత (32)కు పుల్లయ్యగారిపల్లెకు చెందిన సుధాకర్ నాయుడితో 2016లో వివాహమైంది.

ఆపై వీరిద్దరూ 2017లో అమెరికాకు వెళ్లగా, వీరికి రెండున్నరేళ్ల బిడ్డ గీతాంష్ ఉన్నాడు. మంగళవారం రాత్రి ప్రేమలత సూసైడ్ చేసుకున్నదని త్యాగరాజులు నాయుడికి సమాచారం వచ్చింది. దీంతో తీవ్ర ఆవేదన చెందిన వారు అల్లుడిపైనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. మృతదేహాన్ని ఇండియాకు పంపించాలని తాము కోరితే, అందుకు అల్లుడు అంగీకరించడం లేదని తెలిపారు.

ప్రేమలత మరణం వెనుక కుట్ర ఉందని, అల్లుడే హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన ఆయన, ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు. ఈ మేరకు చిత్తూరు కలెక్టర్ భరత్ నారాయణ్ గుప్తాను ఆశ్రయించి పిటిషన్ అందించారు. తమకు న్యాయం చేయాలని వారు కోరారు.