కేసీఆర్ కు షాకిచ్చిన కమలనాథులు... జీహెచ్ఎంసీ ఎన్నికలపై నేషనల్ మీడియా ప్రత్యేక కథనాలు!

05-12-2020 Sat 07:04
  • ఏ పార్టీకీ మెజారిటీ ఇవ్వని గ్రేటర్ ఓటర్
  • భారీగా పెరిగిన బీజేపీ స్థానాలు
  • దేశవ్యాప్తంగా పత్రికల్లో కథనాలు
National Media Stories on GHMC Poll Results

హైదరాబాద్ స్థానిక ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలో ఉన్న కేసీఆర్ కు బీజేపీ ఎంతమాత్రం ఊహించని షాక్ ఇచ్చిందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. నిన్న జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ ముగియగా, ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ రాలేదన్న సంగతి తెలిసిందే. అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించినా, 2016లో జరిగిన ఎన్నికల్లో 4 స్థానాలకు మాత్రమే పరిమితమైన బీజేపీ, ఈ దఫా 48 స్థానాలకు పెరిగిన సంగతి తెలిసిందే.

గ్రేటర్ లో జరిగిన ఎన్నికల ఫలితాలపై జాతీయ మీడియా ఆసక్తిని చూపింది. హైదరాబాద్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ కేసీఆర్ పార్టీకి షాకిచ్చిందని 'ఎన్డీటీవీ' వ్యాఖ్యానించగా, అతిపెద్ద పార్టీగా టీఆర్ఎస్ అవతరించినా, అనుకున్న లక్ష్యం దూరంగానే ఉందని, బీజేపీ రెండో స్థానంలో నిలవడం గొప్ప విజయమని 'జీ న్యూస్' పేర్కొంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతానికి ప్రధాన ప్రతిపక్షం తామేనని బీజేపీ నిరూపించుకుందని 'టైమ్స్ ఆఫ్ ఇండియా' పేర్కొంది.

నిన్న దుబ్బాకలో, నేడు జీహెచ్ఎంసీలో సత్తా చాటిన కమలనాథులు, ఆపై రాబోయే మిగతా ఎన్నికల్లోనూ సర్వశక్తులనూ ఒడ్డటం ద్వారా టీఆర్ఎస్ పక్కలో బల్లెంలా తయారవనున్నారని జాతీయ మీడియా విశ్లేషణలు పేర్కొన్నాయి. పలు రాష్ట్రాల్లోని స్థానిక భాషల పత్రికలు సైతం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలను ప్రముఖంగా ప్రచురించడం గమనార్హం.