USA: అమెరికాపై ఆధిపత్యం కోసం చైనా గూఢచర్యం, సైబర్ నేరాలకు పాల్పడుతోంది: అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్

  • ప్రపంచానికి అతిపెద్ద ముప్పుగా చైనా
  • బహిరంగంగా ఘర్షణకు దిగాలని భావిస్తోంది  
  • రెండు పార్టీలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉంది  
USA Accuses china another time

ప్రపంచ ప్రజాస్వామ్యానికి చైనా అతిపెద్ద ముప్పుగా పరిణమించిందని యూఎస్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జాన్ ర్యాట్ క్లిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సైనిక, సాంకేతిక, ఆర్థిక రంగాల్లో అమెరికాపై ఆధిపత్యం సాధించాలన్న చైనా, ఇప్పుడు తాజాగా రహస్యాలను దోచుకుంటోందని ఆయన ఆరోపించారు.

మార్కెట్లో యూఎస్ కంపెనీల ఆధిపత్యానికి గండికొట్టేందుకు గూఢచర్యం, సైబర్ నేరాలకు పాల్పడుతోందని 'వాల్ స్ట్రీట్ జర్నల్'కు రాసిన ప్రత్యేక వ్యాసంలో ఆయన వెల్లడించారు. అమెరికాకు మాత్రమే పరిమితమైన పేటెంట్లను దొంగిలించే వ్యూహంలో భాగంగానే, తమ ప్రొడక్టులపై పన్నులను పెంచిందని ఆయన ఆరోపించారు.

చైనాలో పాలనలో ఉన్న కమ్యూనిస్టు పార్టీకి అనుగుణంగా అక్కడి కంపెనీలు పనిచేస్తున్నాయని, ఉద్యోగులను అడ్డుపెట్టుకుని, తమకు అనుకూలంగా తీసుకునే నిర్ణయాలను వారు అమలు చేసేలా ఒత్తిడిని పెంచుతున్నారని ఆయన ఆరోపించారు. బైడెన్ ప్రభుత్వంపై ప్రభావం చూపేలా చైనా ఆసియాలోని కొన్ని దేశాలపై సైనిక దాడులను చేసే అవకాశాలు ఉన్నాయని ర్యాట్ క్లిఫ్ హెచ్చరించారు.

ఇక అమెరికాతో సైతం బహిరంగంగా ఘర్షణకు దిగాలని చైనా భావిస్తోందని, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వాషింగ్టన్ సిద్ధంగా ఉండాలని సూచించారు.  యూఎస్ లోని రెండు పార్టీల నాయకులు విభేదాలకు పోకుండా, రానున్న ముప్పును గమనించి, ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక రాడ్ క్లిఫ్ చేసిన ఆరోపణలపై స్పందించిన చైనా అధికార ప్రతినిధి హువా చునియింగ్, ఇవన్నీ నిరాధారమైన ఆరోపణలేనని కొట్టి పారేశారు. చైనా స్వయంగా ఎదుగుతోందని, చైనా ఉత్పత్తులు ప్రపంచంలోని అన్ని దేశాలకూ చేరుతున్నాయని, తమ కంపెనీలను దెబ్బకొట్టడం ద్వారా సమస్యల నుంచి ప్రజల ఆలోచనలను తప్పుదారి పట్టించేందుకే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు.

More Telugu News