గోవాలో శ్రుతిహాసన్ తో ఆడిపాడుతున్న రవితేజ!

04-12-2020 Fri 21:07
  • రవితేజ, శ్రుతిహాసన్ హీరో హీరోయిన్లుగా 'క్రాక్'
  • గోవాలో నేటి నుంచి చివరి పాట చిత్రీకరణ
  • సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు ప్రకటన  
  • రవితేజను పోలీసాఫీసర్ గా చూపిస్తున్న గోపీచంద్
Song shoot in Goa on Raviteja and Shruti Hassan

ఆమధ్య వచ్చిన 'డిస్కో రాజా' సినిమా తర్వాత మాస్ హీరో రవితేజ నటిస్తున్న చిత్రం 'క్రాక్'. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తోంది. రవితేజ పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగుకు సంబంధించి ఇక ఒక పాట చిత్రీకరణ మాత్రం మిగిలివుంది. కాగా, ఈ పాటను నేటి నుంచి గోవాలో హీరో హీరోయిన్లపై చిత్రీకరిస్తున్నారు. దీనికి ప్రముఖ కొరియోగ్రాఫర్ రాజు సుందరం నృత్యాలను కంపోజ్ చేస్తున్నారు.      

తెలుగు రాష్ట్రాలలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అలాగే దీనిని థియేటర్లలోనే రిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ఇప్పటికే ప్రకటించారు కూడా. రవితేజ నటించిన గత చిత్రం 'డిస్కో రాజా' ప్రేక్షకాదరణ పొందలేదు. దాంతో ఈ చిత్రంలో ప్రేక్షకులను అలరించే అన్ని అంశాలను జోడించినట్టు చిత్రం యూనిట్ చెబుతోంది. మరి, ఇతర సినిమాల తాకిడిని తట్టుకుని సంక్రాంతి రేసులో ఈ చిత్రం ఎంతవరకు నిలబడుతుందో చూడాలి!