కరోనా బారినపడిన దక్షిణాఫ్రికా క్రికెటర్... ఇంగ్లాండ్ తో మొదటి వన్డే వాయిదా

04-12-2020 Fri 18:28
  • ఇంగ్లాండ్ తో నేడు జరగాల్సిన తొలి వన్డే
  • మ్యాచ్ కు ముందు కరోనా పరీక్షలు
  • ఓ క్రికెటర్ కు పాజిటివ్
  • తొలి వన్డే డిసెంబరు 6కి వాయిదా
First ODI between South Africa and England postponed after a Safari cricketer tested corona positive

కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని క్రీడాపోటీలు నిర్వహిస్తున్నారు. అయితే చిన్న తప్పిదాలతో ఆటగాళ్లు కూడా కరోనా బారినపడుతున్న సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టులో ఓ ఆటగాడు కరోనా బారినపడడంతో ఇంగ్లాండ్ తో ఇవాళ జరగాల్సిన తొలి వన్డే మ్యాచ్ వాయిదా పడింది.

మ్యాచ్ కు ముందు నిర్వహించిన కరోనా పరీక్షల్లో సదరు ఆటగాడికి పాజిటివ్ వచ్చినట్టు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ధారించింది. దీనిపై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుకు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సమాచారం అందించింది. అనంతరం తొలి వన్డేను డిసెంబరు 6వ తేదీకి వాయిదా వేయాలని ఇరు దేశాల బోర్డులు నిర్ణయించాయి.

రెండు జట్లలోని ఆటగాళ్లు, అంపైర్లు, మ్యాచ్ తో సంబంధం ఉన్న ఇతర వ్యక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మ్యాచ్ వాయిదా వేసినట్టు దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు సీఈఓ కుగాండ్రీ గోవెందర్, ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు సీఈఓ టామ్ హారిసన్ సంయుక్త ప్రకటనలో వెల్లడించారు. కాగా, కరోనా బారిన పడిన ఆ ఆటగాడు ఎవరన్నది దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్రకటించలేదు.