ఓటమిపాలైన ఉప్పల్ ఎమ్మెల్యే అర్ధాంగి... విజయం సాధించిన మేయర్ భార్య

04-12-2020 Fri 18:06
  • జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు
  • ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి భార్య స్వప్నపై చేతన విజయం
  • చర్లపల్లిలో బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి జయభేరి
GHMC Counting in Hyderabad

గ్రేటర్ ఎన్నికల్లో ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. ఉప్పల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి  అర్ధాంగి స్వప్న ఓటమి చవిచూశారు. స్వప్న హబ్సీగూడ డివిజన్ లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే, ఎమ్మెల్యే అర్ధాంగికి బీజేపీ అభ్యర్థి షాకిచ్చింది. హబ్సీగూడలో బీజేపీ అభ్యర్థి చేతన విజయం సాధించింది. అటు, నగర మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవి యాదవ్ చర్లపల్లి డివిజన్ లో జయభేరి మోగించారు. శ్రీదేవి యాదవ్ తన ప్రత్యర్థి సురేందర్ గౌడ్ (బీజేపీ)పై నెగ్గారు.

కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ పై తాజా సమాచారం ప్రకారం... టీఆర్ఎస్ ఇప్పటివరకు 44 డివిజన్లను కైవసం చేసుకుని మరో 14 డివిజన్లలో గెలుపు దిశగా దూసుకువెళుతోంది. ఎంఐఎం 38 డివిజన్లలో విజయం నమోదు చేసుకుని 4 డివిజన్లలో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 34 డివిజన్లలో గెలిచి మరో 13 డివిజన్లలో ముందంజలో నిలిచింది. కాంగ్రెస్ కు రెండు డివిజన్లు దక్కాయి.