Pawan Kalyan: సింహపురిలో పెరిగిన వాడ్ని... నేను చూడ్డానికే యాక్టర్ని, నాలోపల యాక్టర్ ఉండడు: వైసీపీకి పవన్ వార్నింగ్

  • నెల్లూరు జిల్లా నాయుడుపేటలో పవన్ ప్రసంగం
  • జనసేన అంటే ఎందుకంత భయం అని వ్యాఖ్యలు
  • అడ్డుగోడలు బద్దలు కొట్టుకుని ముందుకు వెళతామని స్పష్టీకరణ
Pawan Kalyan road show at Naidupeta in Nellore district

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇవాళ నెల్లూరు జిల్లా నాయుడుపేటలో పర్యటన సందర్భంగా అధికార వైసీపీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పంటలు నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వస్తే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వైసీపీకి జనసేన అంటే ఎందుకంత భయం అని ప్రశ్నించారు. అధికారం ఉంది కదా అని పోలీసుల సాయంతో అడ్డుగోడలు కడదామని ప్రయత్నిస్తే గోడలు బద్దలు కొట్టుకుని ముందుకు వెళతామని స్పష్టం చేశారు.

ఓ కానిస్టేబుల్ కొడుకుగా తనకు పోలీసులంటే ఎంతో గౌరవం ఉందని, కానీ పోలీసులు అధికార పక్షం ఒత్తిళ్లతో అక్రమ కేసులు బనాయిస్తే వారిని గుర్తుంచుకుంటామని హెచ్చరించారు. తాను వచ్చింది ఎవరితోనూ గొడవ పెట్టుకునేందుకు కాదని, రైతుల్ని పరామర్శించడానికని జనసేనాని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాను సింహపురిలో పెరిగినవాడ్నని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని అన్నారు. తాము ఎవరి జోలికి వెళ్లబోమని, తమను రెచ్చగొడితే రోడ్లమీదకు రావడానికైనా వెనుకాడేది లేదని వ్యాఖ్యానించారు. తాను చూడ్డానికి మాత్రమే యాక్టర్ నని, కానీ తన లోపల యాక్టర్ ఉండడని తీవ్రస్వరంతో హెచ్చరించారు.

"వైసీపీ నేతలు ఓ విషయం గుర్తుంచుకోవాలి. అధికారం శివుడి మెడలో పాము వంటిది. శివుడి మెడలో ఉన్నంతవరకే ఆ సర్పానికి విలువ. రోడ్డుమీదకు వస్తే దాని పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు. అధికారం లేని రోజున వైసీపీ నాయకుల పరిస్థితి ఏంటో చూసుకోండి" అని హితవు పలికారు.

More Telugu News